calender_icon.png 21 September, 2024 | 7:19 PM

కల్వకుర్తి ఎత్తిపోతల అసంపూర్తి పనులను పూర్తిచేస్తాం

20-09-2024 12:17:51 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

రంగారెడ్డి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కల్వకుర్తి ఎత్తిపోతల అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తిచేసి నాగిళ్ల వరకు సాగు జలాలను తీసుకొస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలంలోని నాగిళ్ల, దొడ్లపహాడ్ నుంచి ఆమనగల్లు మండలంలోని సింగంపల్లి, పోలేపల్లి గ్రామం వరకు కేఎల్‌ఐ డీ అక్విడెక్ట్ అసంపూర్తి పనులను ఇరిగేషన్ అధికారులు ఎస్‌ఈ ఎస్‌ఎన్ రెడ్డి, ఈఈ శ్రీకాంత్, డీఈ దేవానంద్‌తో కలిసి పరిశీలించారు. ఆయా గ్రామాల మధ్య అసంపూర్తి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసంపూర్తి పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని, కేఎల్‌ఐ, పాలమూరు ఎత్తిపోతల పనులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ముందుకు పోతోందని తెలిపారు. కాగా, సింగంపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆర్‌ఆర్‌ఆర్ సర్వేపై ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకున్న ఎకరా, అరెకరా భూములు కూడా ఆర్‌ఆర్‌ఆర్ కారణంగా కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌పై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, రైతులు ఆందోళనకు గురికావొద్దని పేర్కొన్నారు.