calender_icon.png 28 September, 2024 | 6:48 PM

ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తాం

26-09-2024 03:04:47 AM

  1. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
  2. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

గద్వాల (వనపర్తి), సెప్టెంబర్ 25 (విజయక్రాంతి)/జడ్చర్ల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకంలో గద్వాల జిల్లా గట్టు మండలంలోని గట్టు ఎత్తిపోతల పథకాన్ని, జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్‌ను బుధ వారం పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహరి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్లు సంతోష్‌ర విజయేంద్రబోయిలతో కలసి సందర్శించారు.

మొదటగా వల్లూరు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రిజర్వాయర్ కట్టను పరిశీలించి, మీడీయా సమా వేశంలో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలన్న చిత్తశుద్ధితో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు  కృషి చేస్తున్నారని, ఏకకాలంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.

అందుకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామన్నారు. మంచిని మంచి అని కూడా చెప్పలేని స్థితిలో బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారని విమర్శించారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే పాలమూరు ఎత్తిపోతల పథకం సమర్థవంతంగా ముందుకు సాగుతుందన్నారు. గత పాలకులు అనవసర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం పాలమూరు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల సాగర్ పనులను పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కృష్ణానది ప్రారంభం నుంచి జూరాల ప్రాజెక్టు వరకు ఉమ్మడి జిల్లా జూరాలపై ఆధారపడి ఉందన్నారు.

జూరాలపై రెండు లక్షలు, నెట్టెంపా డుపై రెండు లక్షలు, భీమా ప్రాజెక్టుపై రెండు లక్షలు మొత్తం ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నదన్నారు. రిజర్వాయర్‌లో నీరు లేకుంటే కరువు ఏర్పడుతుందని అందుకోసమే గట్టు ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు.

ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.45 కోట్లు మంజూరు చేసినందుకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత అధికారులు రామకృష్ణ, ప్రశాంత్ పాటిల్, అనిల్, ఎస్పీ జానకి పాల్గొన్నారు.