హైదరాబాద్: రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... రూపాయి రూపాయి పోగుచేసి రుణమాఫీ చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని రైతు కుంటుంబాలకు రుణమాఫీ చేస్తామని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. రేషన్ కార్టులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఆగస్టు పూర్తయ్యేలోపు రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులారా, రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలన్నారు. తల ఎత్తుకొని... ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయండని పేర్కొన్నారు.
మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని 25000 చొప్పున నాలుగు దపాలుగా పూర్తి చేశారని ఆరోపించారు. ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నాము. అయితే అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారని ఆయన పేర్కొన్నారు. సీఎం సవాల్ ఓట్ల కోసమే.. ఎన్నికల సవాల్ అనుకున్నారని తెలిపారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూపాయి రూపాయి పోగుచేసి రుణమాఫీని అమలు చేయబోతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమం రుణమాఫీ అన్నారు. చెప్పిన మాట ప్రకారం చేస్తున్నామని ప్రతి గ్రామానికి కాంగ్రెస్ నాయకులు వెళ్లాల్సిన అవసరం ఉందన్న భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, వివరించి రైతులు ప్రజల హృదయాలు గెలవాలని పార్టీ నేతలను, కార్యకర్తలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.