07-04-2025 01:43:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): తెలంగాణలో వచ్చేసారి అధికా రంలోకి వచ్చేది బీజేపీయే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
బీజేపీ ఆవిర్భవించిన రోజుల్లో పార్టీని చాలామంది అవహేళనగా చూశారని, ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా..? అని అవమానంగా మాట్లాడారని, అలాంటి స్థితి నుంచి పార్టీ నేడు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే స్థాయికి చేరుకుందని కొనియాడారు. రాష్ట్రంలో అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ భావజాలం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి బలిదానమయ్యారని గుర్తుచేసుకున్నారు.
జాతీయ భావజాలం, పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులర్పిస్తున్నామని తెలిపారు. దేశం లో నెహ్రూ కుటుంబానికి మాత్రమే దేశాన్ని పరిపాలించే అర్హత ఉందని కొన్ని పార్టీలు ప్రచారం చేసుకున్నాయని, కానీ టీ అమ్ముకునే సాధారణ వ్యక్తిని దేశానికి మూడుసార్లు ప్రధాని చేసిన ఘనత బీజేపీకే దక్కిందని పేర్కొన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తాం..
ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు, విదేశీ దౌత్యనీతి.. ఇలా అనేక రకాలుగా ప్ర ధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిపథంలో సాగుతోందని కిషన్‌రెడ్డి పేర్కొ న్నారు. తెలంగాణలో తప్పకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని భరోసా వ్యక్తం చేశారు.
రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, హామీల వైఫల్యాలపై నిరంతర పోరాటాలు చేయాలని పార్టీ కార్యకర్తలకు పి లుపునిచ్చారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మజ్లి స్ పార్టీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీపడి రాజకీయ కుట్రలు చేస్తున్నాయన్నారు.
ఈ నెల 14 వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు, 14 నుంచి 22 వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.