calender_icon.png 15 November, 2024 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభ్రత పాటించని హోటళ్లను మూసివేయిస్తాం

14-11-2024 02:15:52 AM

నగరంలో పలు హోటళ్లను తనిఖీ చేసిన మేయర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అం దించని, పరిశుభ్రతను పాటించని హోటళ్లను మూసివేస్తామని మేయర్ గద్వాల విజయలక్ష్మీ హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ కార్యాల యంలో బుధవారం మేయర్ ఫుడ్ సేఫ్టీ విభాగంపై సమీక్షించారు. అనంతరం ఆమె లక్డీక పూల్ మొఘల్ రెస్టారెంట్, మాసబ్ ట్యాంక్‌లోని డైన్‌హిల్ హోటల్‌ను అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీల్లో వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో ఉంచి.. మళ్లీ వాటినే వేడి చేసి వినియోగదారులకు అందిస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న హోటళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. మాంసాహార పదార్థాల కొనుగోలు రసీదులను వెటర్నరీ అధికారులు పరిశీలించి నిబం ధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అంతకుముందు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నగరంలో ఆహార భద్రత మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో హెల్త్ విభాగం అడిషనల్ కమిషనర్ పంకజ, సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మూర్తిరాజ్, పుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 

బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్‌కు మేయర్‌కు ఆహ్వానం.

ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే బయోడైవర్సిటీ జాతీయ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా జాతీయ బయోడైవర్సిటీ చైర్మన్ అచలేందర్ రెడ్డి బుధవారం మేయర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంచడంలో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం విశేష కృషి చేసిందన్నారు. యూబీడీ అడిషనల్ కమిషనర్ వీవీఎల్ సుభద్రా దేవి, డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు.