04-12-2024 12:52:12 AM
రాజేంద్రనగర్, డిసెంబర్ 3: అనుమతి లేని ఆర్‌ఎంసీ ప్లాంట్లు, క్రషర్లను మూసేస్తామని, ఈ విషయమై ఉపేక్షించేది లేదని శం షాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్ హెచ్చరించారు. ‘అడ్డగోలుగా ఆర్‌ఎంసీ ప్లాంట్లు’ శీర్షికతో ఇటీవల విజయక్రాంతి పత్రికలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు.
శంషాబాద్ మున్సిపాలిటీతోపాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అనుమతి లేకుండా, అడ్డగోలుగా క్రషర్ మిషన్ల తోపాటు ఆర్‌ఎంసీ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయక్రాంతి పత్రికలో కథనం ప్రచురించగా స్పందించిన తహసీల్దార్ రవీందర్ దత్.. సంబంధిత క్రషర్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు మంగళవారం వెల్లడించారు.
క్రషర్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్ల నిర్వహణకు అసలు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ అనుమతులు ఉన్నాయి.. వాటిని ఎవరిచ్చారు? అనే వివరాలను వెంటనే తహసీల్ కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలించారు. అనుమతులు లేని వాటిని వెంటనే మూసి వేస్తామని ఆయన హెచ్చరించారు.
అడ్డగోలుగా క్రషర్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్లు నిర్వహించడంతో శంషాబాద్ పట్టణంతో పాటు మండల పరిధిలో తీవ్రమైన వాయు కాలు ష్యం వాటిల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం ఎన్ని క్రషర్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్లు ఉన్నాయో ఆరా తీస్తున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.