calender_icon.png 28 November, 2024 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నేతల భూముల లెక్కలు తేలుస్తాం

28-11-2024 03:01:33 AM

  1. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని వేలాది ఎకరాల కబ్జా 
  2. పేదల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములను 
  3. తిరిగి అర్హులకు అప్పగిస్తాం
  4. మంత్రుల మధ్య విభేదాలున్నాయనడం అవాస్తవం 
  5. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు 
  6. రైతు భరోసాపై త్వరలోనే విధివిధానాలు 
  7. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది పార్టీ నిర్ణయిస్తుంది 
  8. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్‌చాట్ 

కేటీఆర్ ఇంకా భ్రమలోనే.. 

కేటీఆర్ ఇంకా భ్రమలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం ఎవరి తరం కాదు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. ఫెడరల్ సిస్టమ్‌లో ఒకరితో ఒకరు టచ్‌లో ఉండటం సహజమే. కాంగ్రెస్ ఫిరాయింపు లను ప్రోత్సహించదు.

 సీఎం భట్టి

హైదరాబాద్, నవంబర్ 27(విజయక్రాంతి): ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నేతలు వేల ఎకరాల భూములు  కాజేశారని.. ఆ భూముల వివరాలను బయటకు తీస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం పేదల నుంచి లాక్కున్న అసైన్డ్ భూముల లెక్కలు సేకరిస్తున్నామని, వాటిని స్వాధీనం చేసుకొని అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని భట్టి స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దాదాపు 26 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేశాయని ఆయన తెలిపారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి బుధవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

దళితులు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు ఎంతమందికి భూమి ఇచ్చారని ఆయన పశ్నించారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి కనీసం గ్రూప్-1 పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేదని నిలదీశారు.

తమ ప్రభుత్వం వచ్చాక 50 వేలకు పైగా ఉద్యోగాలిచ్చామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని, ఎవరెన్ని సభలు, సమావేశాలు పెట్టినా పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. 

కేటీఆర్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా భ్రమలోనే ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం ఎవరి తరం కాదని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైరయ్యారు. ‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. మేం అధికారంలో ఉన్నాం.. వారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఫెడరల్ సిస్టమ్‌లో ఒకరితో ఒకరు టచ్‌లో ఉండటం సహజమే’నని మీడియా అడిగిన ప్రశ్నకు భట్టి సమాధానమిచ్చారు. 

తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ప్రగతిశీల భావాలే ఎజెండాగా ముందుకెళ్తోందని, హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించామని, త్వరలోనే పెద్దఎత్తున అభివృద్ధి పనలకు ప్రారంభోత్సవాలు ఉంటాయని తెలిపారు.

స్థానిక ఎన్నికల విషయమై త్వరలోనే చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చామో త్వరలోనే చెబుతామన్నారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఢిల్లీ పర్యటనలో ఈ అంశం చర్చకు రాలేదన్నారు. 

ఇదేనా మీ సంస్కారం!

కేటీఆర్ కొద్దిరోజులుగా ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థంకావడం లేదని, సీఎంను, ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. పదేళ్లు మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు సంస్కారం ఉండాలని, కలెక్టర్‌ను పట్టుకొని సన్యాసి అని వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీశారు.

10 ఏళ్లలో ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేకపోయారని, తమ ప్రభుత్వం కార్డులిస్తుంటే ఇంట్లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని.. అదే స్థాయిలో బీజేపీకి ఆదరణ తగ్గుతుందన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే అందుకు నిదర్శనమన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మంత్రినే కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారని ఆయన తెలిపారు.  

ఒక్కో హామీని అమలు చేస్తున్నాం..

ప్రజలకిచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి నెలకు రూ.400 కోట్లు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌కు నెలకు రూ.150 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే భూమిపూజ చేస్తామని తెలిపారు.

దేశ చరిత్రంలో ఎన్నడూ లేనివిధంగా 15 రోజుల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ అందలేదని, వారికి కూడా త్వరలోనే రుణమాఫీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. రైతు భరోసా విధివిధానాలపై కసరత్తు జరుగుతోందని..

త్వరలోనే  రైతు భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. కులగణన పేరుతో కులాలను విడగొడుతున్నారని బీజేపీ విమర్శలు చేయడం సరికాదన్నారు. కులాలు, మతాల పేరుతో విభజన రాజకీయాలలు చేసేది బీజేపీయేనని మండిపడ్డారు. కులగణన ద్వారా ప్రజల ఆర్థిక, రాజకీయ స్థితిగతులు తెలుస్తాయన్నారు. . 

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి 

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్మకంగా ఉండాలని, ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని భట్టి తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన ప్రతిపక్షనేత పాత్రను పోషించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు లేవని, సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హైడ్రా, మూసీ విషయంలో అన్ని విధాలుగా ఆలోచించాకే ముందుకెళ్తున్నామని, మూసీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 

ఇథనాల్ కంపెనీపై స్టడీ చేస్తాం.. 

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ కంపెనీపై వ్యతిరేకత విషయమై మీడియా ప్రస్తావించగా.. ఇథనాల్ కంపెనీపై స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటామని భట్టి తెలిపారు. దిలావర్‌పూర్ ల్లి గ్రామాల మధ్య పరిశ్రమను నిర్మిస్తుండగా ఐదు గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.