- మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద
- కేస్లాపూర్ ఆశ్రమ ఉన్నత పాఠశాల పరిశీలన
ఆదిలాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో బాలికల విద్యాభివృద్ధిపై ఆకస్మిక తనిఖీలు చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని ప్రభుత ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆమె తనిఖీ చేశారు.
విద్యార్థినులతో ముచ్చటిస్తూ పాఠశాల అధ్యాపకుల ప్రవర్తన, బోధనా విధానం, హాస్టల్ వసతులు గురించి తెలుసుకున్నారు. హాస్టల్ రూమ్‌లు, వంటశాల, టాయిలెట్స్‌లను పరిశీలించారు. బాలికలు, మహిళల సమస్యలు మహిళా కమిషన్ దృష్టికి ఎలా తీసుకురావాలో అవగాహన కల్పించారు.
అంతకుముందు ఇంద్రవెళ్లి మండలంలోని నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయ అర్చకులు, స్థానికులు ఆమెకు ఘనసాగతం పలికారు. ఆమెవెంట మహిళా కమిషన్ సభ్యురాలు ఈశరీబాయి, పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.