28-03-2025 02:08:19 AM
కులాల పేర్లను గౌరవప్రదంగా మారుస్తాం
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు
2వ రోజు పర్యటనలో జగిత్యాల జిల్లాలో కమిషన్ బృందం
కొండగట్టులో ప్రత్యేక పూజలు..
జగిత్యాల, ధర్మపురి కాలనీల్లో పర్యటన
జగిత్యాల, మార్చి 27 (విజయక్రాంతి): ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో, నేటికీ చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించింది. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి ఉదయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని, సాయం త్రం ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, ఈఓలు ప్రసాదం అందజేశారు. చైర్మన్, సభ్యులకు ఆ ఆలయాల అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం జగిత్యాల టిఆర్ నగర్, గాంధీనగర్’తో పాటు ధర్మపురి దుర్గమ్మ కాలనీల్లో బీసీ కమిషన్ బృందం పర్యటించి, కుల సంఘాల నాయకుల విజ్ఞప్తులను స్వీకరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు మాట్లాడారు. చులకన భావంతో కులాలను పిలవడం వల్ల ఆ కులస్తులు, వారి పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ దృష్టి కి వచ్చిందన్నారు. వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బీసీ జాబితాలోని ఎనిమిది కులాల పేర్లు మార్చాలని, కొన్ని పర్యాయ పదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే తెలంగాణ బీసీ కమిషన్ అభ్యంత రాలు కోరిందన్నారు. ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. కులాల పేర్ల మార్పులపై ఎవరికైనా అభ్యంత రాలు న్నా, ఇతర పర్యాయ పదాలున్నా తెలియజేయాలని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు. కమిషన్’కు వచ్చిన అభ్యంతరాలు, సూచనల ఆధారంగా ఆయా కులాల పేర్ల మార్పుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ నిరంజన్ వివరించారు. బీసీ రిజర్వేషన్ ఫలాలు బీసీ కులాల్లోని అందరికీ అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టి ఆమోదించిందన్నారు. ఈ మేరకు వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇది దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమ న్నారు. అనేక దశాబ్దాల నుంచి వెనుక బాటుకు గురైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయన్నారు. కులం పేరిట ఇబ్బంది పడుతున్న వారు ఆత్మ న్యూనతా భావానికి గురికావద్దని సూచించారు.
పిల్లలను చక్కగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలని, ఉన్నత స్థానాలు అధిరోహించేలా అన్ని రంగాల్లో వారిని తీర్చిదిద్దాలన్నారు. పేదలకు ప్రభుత్వం విద్యా రంగంలో అనేక సంక్షేమాలను అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయా కులాల పేర్ల మార్పు అంశం వచ్చే నెలలో పరిష్కరిస్తామన్నారు. బీసీ కులాల్లోని అందరికీ రాజ్యాంగ ఫలాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించామని, త్వరలో మిగతా జిల్లాల్లో పర్యటించి, ఆయా బీసీ కులాల స్థితిగతులను నేరుగా తెలుసు కుంటామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన యువతీ యువకులు, రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వీర ముష్టి కులం పేరు మార్చాలి...
’వీర ముష్టి’ అంటే పూర్వ కాలంలో యుద్ధ వీరులుగా వుండే వారని, కాలక్రమేణా ముష్టి అనే పదం బిచ్చగాళ్ళు అడుక్కునే పర్యాయ పదంగా మారిందని, వీరాముష్టి ప్రతినిధులు బీసీ కమిషన్ చైర్మన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. తమ కులాన్ని ’వీర భద్రియ’ కులంగా మార్చాలని వినతి చేశారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గడ వంశీయులుగా మార్చాలి...
కులం సర్టిఫికెట్లో తమ కులం పేరును గడ వంశీయులు గా మార్చాలని దొమ్మరి కుల సంఘం ప్రతినిధులు బిసి కమిషన్’కు విజ్ఞప్తి చేశారు. కులం పేరు దొమ్మరి ఉండడం వల్ల తాము సమాజంలో అనే క ఇబ్బందులు పడుతున్నామని, చులకన భావంతో చూస్తున్నారని వివరించారు. విద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో తమ పిల్లలు అవమానానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దీనిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని బీసీ కమిషన్ హామీ ఇచ్చింది. కులాలను అలా పిలవడం వల్ల ఎలాంటి ఆత్మన్యూనత భావానికి గురికావద్దని, చులకన భావం తో ఉండవద్దని సూచించారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి కల్పన, జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, ఆయా మండలాల స్థాయి అధికారులు పాల్గొన్నారు.