calender_icon.png 27 November, 2024 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్‌ అమరవీరుల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం

28-08-2024 05:22:56 PM

బషీర్‌బాగ్‌ విద్యుత్‌ అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ స్థూపం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నివాళులు!

ఖమ్మం, (విజయక్రాంతి):  బషీర్‌బాగ్‌ విద్యుత్‌ పోరాటంలో అసువులు బాసిన విద్యుత్‌ అమరవీరులకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. 2000 సం.లో విద్యుత్‌ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా బషీర్‌బాగ్‌ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరులకు వారి 24వ, వర్థంతి సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన రామకృష్ణ స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సిపిఐ (ఎం.ఎల్‌.) మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఆనాడు చంద్రబాబు నాయుడు విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకురావటానికి ప్రయత్నిస్తే విద్యుత్‌ రంగం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రైవేటీకరించొద్దని డిమాండ్‌ చేస్తూ ఆనాడు 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్‌ పోరాటం చేశామన్నారు.

ఆనాటి పోరాటం, విద్యుత్‌ అమరవీరుల త్యాగాల వల్ల రైతులకు ఉచిత విద్యుత్‌, పేదలకు క్రాస్‌ సబ్సిడీని పాలకులు ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల జాబితాలోని విద్యుత్‌ను లాగేసుకొని సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. జి.ఎస్‌.టి.తో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిమీద దెబ్బ కొట్టారని వారు విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి చ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటన చేసిందని, ఈ పర్యటనలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో తెలంగాణ అభివృద్ధి కోసం చర్చలు జరిపామని వారు ప్రకటించారని, అయితే వారు ప్రపంచ బ్యాంకుతో ఏం చర్చలు జరిపారు? ప్రపంచ బ్యాంకు ఏం సలహాలు ఇచ్చిందో తెలంగాణ ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎందుకంటే ప్రపంచ సాధారణంగా ప్రజలకు ఉచితంగా ఏమీ ఇవ్వవద్దని, పన్నులు విధించండని, సబ్సిడీలు ఎత్తివేయండని సూచనలు చేస్తుందని, అలాంటి సూచనలు ఏమైనా ముఖ్యమంత్రి తీసుకున్నారా? అన్న విషయం తెలియజేయాలన్నారు. 24 ఏండ్లు గడుస్తున్నా ఆనాటి విద్యుత్‌ పోరాట దృశ్యాలు కండ్ల ముందే మెదలాడుతున్నాయని అన్నారు. ఆనాటి ఘటన యాదృచ్ఛికమైనది కాదని, ప్రభుత్వ విధానాలకు సంబంధించినదని చెప్పారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడక తప్పదని హెచ్చరించారు. నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. సంస్కరణలు, ఆర్థిక విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత వామపక్ష పార్టీలపై ఉందని, విద్యుత్‌ అమరవీరుల సాక్షిగా ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. విద్యుత్‌ పోరాటం, ముగ్గురు అమరవీరుల త్యాగాల వల్లే నేటికి కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచాలంటే పాలకులు భయపడుతున్నారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్‌ సంస్కరణల వల్ల ప్రజలపై భారం పడుతోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు ఎం.సుబ్బారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రం, జిల్లా కమిటి సభ్యులు మెరుగు సత్యనారాయణ, దొంగల తిరుపతిరావు, పిన్నింటి రమ్య, ఎం.ఎ.జబ్బార్‌, నాయకులు బోడపట్ల సుదర్శన్‌, ఎస్‌.కె.మీరా, కత్తుల అమరావతి, బండారు యాకయ్య, సత్తెనపల్లి శ్రీను, సిపిఐ జిల్లా నాయకులు పోటు కళావతి, శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వర్లు, తాటి నిర్మల, సిపిఐ (ఎం.ఎల్‌.) మాస్‌లైన్‌ జిల్లా నాయకులు పుల్లయ్య, ఆవుల అశోక్‌, రaాన్సీ తదితరులు పాల్గొన్నారు.