డిసిసి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి..
గజ్వేల్ (విజయక్రాంతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని కనీసం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని ఒకటవ, రెండవ వార్డులలో కాంగ్రెస్ పార్టీ జండావిష్కరణలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. మున్సిపల్ పరిధిలోని 20 వార్డులలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలను చైతన్యం చేయాలని స్పష్టం చేశారు. త్వరలోనే గజ్వేల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా గత మున్సిపల్ పాలకవర్గం తప్పిదాల ఫలితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోగా, సరిచేసి అర్హులకు ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు పంపిణీ చేస్తుండగా, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన చేపట్టడంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమం, నేతన్నల ఆర్థికాభివృద్ధి, మహిళాభ్యున్నతి, దళితుల సంక్షేమం తదితర అంశాలకు ప్రాధాన్యత నిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా గజ్వేల్ నియోజకవర్గం నుండి కెసిఆర్ ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటు లేకపోగా, ఇతర నేతలు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. దీంతో గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోగా, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్న నేతలకే అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెండో వార్డు అధ్యక్షులుగా మల్లారెడ్డి, రెండో వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా కప్ప మహేష్ ను ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంక్షారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్లు షహనా సమీర్, సుభాష్ చంద్రబోస్, రాంచంద్ర చారి, మాజీ సభ్యులు షరీఫ్, మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, నాయకులు కొండల్ రెడ్డి, రమేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గుంటుకు శ్రీనివాస్, రాజు గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.