* తెలంగాణకు రావాల్సిన వాటాకంటే ఎక్కువ ఇళ్లను మంజూరు చేస్తాం
* విద్యుత్ విషయంలోనూ సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం
* కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్
కరీంనగర్, జనవరి 24 (విజయక్రాంతి): కుల, మత బేధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి స్వంత ఇల్లు ఉండాలనేది ప్రధాని మోడీ లక్ష్యమని, గత పదేళ్లలో పీఎం ఆవాన్ గ్రామీణ యోజన కింద 2 కోట్ల 68 లక్షల, అర్బన్ ఆవాస్ యోజన కింద 90 లక్షల ఇండ్లు నిర్మించామని, రాబోయే ఐదేళ్లలో దేశంలో మరో మూడు కోట్ల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించు కున్నామని, ఈ ఏడాది కోటి ఇళ్లు నిర్మిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు.
శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మేయర్ సునీల్‌రావ్ లతో కలిసి అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన కాంప్లెక్స్ను ప్రారంభిం చారు. అనంతరం హౌజింగ్ బోర్డ్‌లో 18 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 24 గంటల మంచినీటి సరఫరాను ప్రారంభిం చారు.
స్మార్ట్ సిటీ కింద ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్లూంలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన వాటాకంటే అధికంగా ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో విద్యుత్ సమస్యను రానీ యామని, ఈ విషయంలో ఏమైనా కావాలంటే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
పీఎం కిసాన్ యోజన కింద తెలంగాణవ్యాప్తంగా 30 లక్షల 70 వేల మంది రైతులు లబ్ది పొందుతున్నారన్నారు. స్వచ్ఛ భారత్ కింద తెలంగాణకు 30 లక్షల 27 వేల టాయిలెట్లు నిర్మించామని తెలిపారు. తెలంగాణలోని ఒక కోటి 20 లక్షల ఖాతాల్లోకి నేరుగా కేంద్రం వివిధ సంక్షేమ పథకాల సబ్సిడీని జమ చేస్తుందని తెలిపారు.
తెలంగాణలో రోడ్లనిర్మాణం కోసం ఒక లక్షా 20 వేల కోట్లు, ధాన్యం కొనుగోలుకు ఒక లక్షా 10 వేల కోట్లు ఖర్చు చేశామని, రీజనల్ రింగు రోడ్డు కోసం 25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మొత్తంగా మా ప్రభుత్వం 10 లక్షల కోట్లకుపైగా తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేసిందని తెలిపారు.
పథకాల వినియోగంలో కరీంనగర్ ముందంజలో ఉండని, కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా కమాండ్ కంట్రోల్ రూం ఆధునీకరిం చామని, దీని ద్వారా ప్రజలకు మరింత భద్రత పెరుగుతుందని, స్మార్ట్ క్లాస్ల ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన బోధన జరుగుతుందన్నారు.
స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ కు 826 కోట్లు వచ్చాయని, ఇందులో కేంద్రం నుండి 428 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 398 కోట్లు విడుదల య్యాయని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇళ్లకు 365 రోజులు తాగునీరు అందించిన ఘనత కరీంనగర్కు దక్కుతుం దని, గతంలో చంఢీఘడ్లోని మణిముద్రలో 24 గంటల నీటి సరఫరా జరిగిందని తెలిపారు.
కరీంనగర్ అంటే ధైర్యమని, ఈ మట్టిలో ఏదో మహత్తు ఉందని అన్నారు. ఎన్నో పోరాటాలకు, నిత్య చైతన్యాలకు, ఎందరో త్యాగధనులకు పురిటిగడ్డ ఈ నేల అంటూ, కష్టపడి పనిచేస్తున్న బండి సంజయ్‌ని మనస్పూర్తిగా అభినందించారు. అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన తీవ్ర సమస్యగా ఉన్న డంపింగ్ యార్డును సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ సునీల్‌రావ్‌లు డంపింగ్ యార్డ్ సమస్యను ఖట్టర్‌కు వివరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ లోని 4 వేల ఇండ్లకు నిరంతరాయంగా 24 గంటలపాటు నీళ్లను అందించడం గర్వకారణమన్నారు.
కరీంనగర్ సిటీ మొత్తానికి దీన్ని వర్తింపజేస్తామని, పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిధులు ఇవ్వాలని ఖట్టర్ను కోరారు. డంపింగ్యార్డు సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ఖట్టర్ హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాదం స్కీంలో చేర్చుతున్నామని, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్కిల్లో చేరుస్తున్నామని తెలిపారు.
సిరిసిల్ల, వంగర ప్రాంతాల్లో నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, కరీంనగర్లో ఇఎస్‌ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశానికి అధ్యక్షతన వహించిన నగర మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులు రాబట్టడంలో బండి సంజయ్ కృషి ఎనలేనిదన్నారు.
రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ కేంద్రం నుంచి రావాల్సిన సహకారాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కార్పొరేటర్లు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.