calender_icon.png 27 January, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఈఫ్‌టీఏ’ దేశాల నుంచి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తాం

26-01-2025 12:57:40 AM

  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

స్విట్జర్లాండ్‌లో ‘టీఈపీఏ’ డెస్క్ ప్రారంభం

హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఫ్‌టీఏ )లో సభ్య దేశాలైన స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్ నుంచి తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరిట శనివారం ఆయన స్విట్జర్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన ట్రేడ్ అండ్ ఎకానమీ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (టీఈపీఏ) డెస్క్‌ను ప్రారంభించారు.

అనంతరం జ్యూరి ఇన్నోవేషన్ పార్క్‌లో కాన్ఫెడరేషన్ సూయిస్, స్విట్జర్లాండ్ ఇన్నోవేషన్ సంయుక్తంగా నిర్వహించిన టీఈపీఏ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఈఫ్‌టీఏ దేశాల కంపెనీల కోసం సింగిల్ విండో సేవలు అందించేందుకు తాము టీఈపీఏ డెస్క్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. పెట్టుబడుల గమ్యస్థానంగా నిలవడానికి తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. 

పెట్టుబడుల్లో మెజార్టీ వాటా కోసం..

ఈఎఫ్‌టీఏలో భారత్ గతేడాది మార్చిలో భాగస్వామిగా చేరింది. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్ వంటి దేశాలు భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై పరస్పరం  సంతకం చేశాయి.

దీనిలో భాగంగా ఆయా దేశాలు రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్ యూరోల వరకు పెట్టుబడి పెట్టేందుకు , తద్వారా ఒక మిలియన్ ఉద్యోగాలను సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. పెట్టుబడులు, ఉద్యోగాల్లో వీలైనంత ఎక్కువ వాటాను హైదరాబాద్‌కు మళ్లించడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దీనిలో భాగంగానే జ్యూరి ఇన్నోవేషన్ పార్క్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిథ్యం వహించారు.