28-04-2025 01:56:05 AM
అనంతనాగ్, ఏప్రిల్ 27: పహల్గాం ఉగ్రదాడి గురించి మన్‌కీబాత్ చర్చాకార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తావించారు. ఆదివారం జరిగిన మన్‌కీబాత్ 121వ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల వెన్నువిరుస్తామన్నారు. ‘ఈ ఘటన ఎంతగానో కలిచివేసింది. ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నాడు. జమ్మూకశ్మీర్‌లో శాంతిని స్థాపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
జమ్మూలో పాఠశాలలు, కళాశాలలు తెరచుకుంటున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటక రంగం అభివృద్ధి చేస్తోంది. ఇదంతా చూసే ఉగ్రవాదులు కశ్మీర్‌ను టార్గెట్ చేశారు. ఈ దాడికి పాల్పడిన వారికి కఠినమైన శిక్ష విధిస్తాం. 140 కోట్ల మంది ప్రజల మద్దతు భారత సైన్యానికి అతిపెద్ద బలం. ఈ దాడిని భారత ప్రజలు ఒకే గొంతుతో వ్యతిరేకించాలి. భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు మరోసారి కృతజ్ఞతలు.’ అని పేర్కొన్నారు.