calender_icon.png 10 October, 2024 | 8:55 AM

కొడంగల్‌లో ఫార్మా సిటీని అడ్డుకుంటాం

10-10-2024 12:42:06 AM

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

రైతుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు

కొడంగల్, అక్టోబర్ 9: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీని అడ్డుకుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.

ఫార్మా సిటీ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల నిరసనల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పిలుపుమేరకు బుధవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోలేపల్లి రేణుక ఎల్లమ్మ ఆలయం నుంచి దుద్యాల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర తలపెట్టారు. ఈ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతి నిధులను, నాయకులను పోలీసులు ముంద స్తు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ నుంచి కొడంగల్ బయలుదేరిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని తుంకిమెట్ల గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై డీఎస్పీ కరుణ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ఫార్మా సిటీని అడ్డుకునేందుకు బాధిత రైతుల తరఫున పోరాడతామని తెలిపారు.

పచ్చని పంట పొలాల్లో ఫార్మా విషం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు అక్రమ అరెస్ట్‌లతో తమ పోరాటాన్ని ఆపలేరని అన్నారు. కాగా, నాయకు లను అడ్డుకున్నారన్న విషయం తెలుసుకున్న బాధిత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రైతులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. చావడానికైనా సిద్ధమని, తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. అనంతరం రైతుల ధర్నా దగ్గరకు వచ్చిన దుద్యాల తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్‌కు రైతులు, నాయకులు ఫార్మా కంపెనీలు వద్దంటూ వినతి పత్రాలు అందజేశారు. 

అరెస్ట్‌ను ఖండిస్తున్నాం : సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని అన్నారు. శాంతియుత పాదయాత్రకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తనతో పాటు జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడంతో పాటు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.