calender_icon.png 24 October, 2024 | 11:57 AM

కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడిస్తాం

24-10-2024 01:48:30 AM

  1. మల్లన్నసాగర్ పరిహారంపై హరీశ్‌రావు అసత్య ప్రచారం మానుకోవాలి
  2. నిర్వాసితుల పేరుతో దోచుకున్న డబ్బుకు లెక్క చెప్పాలి 
  3. మీడియా సమావేశంలో మల్లన్నసాగర్ నిర్వాసితులు

గజ్వేల్, అక్టోబర్ 23: మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్‌ను ముట్టడిస్తామని మల్లన్నసాగర్ నిర్వాసితులు హెచ్చరించారు.

బుధవారం గజ్వేల్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్‌రావు, స్థానిక బీఆర్‌ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి మల్లన్నసాగర్ పరిహారం విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. భూ నిర్వాసితులను గ్రామాల నుంచి తరలించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 వేల దారి ఖర్చులు ఇచ్చామంటూ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

అర్హులందరికీ గత ప్రభుత్వం ప్యాకేజీలు ఇస్తామని చెప్పిందని, ఆ తర్వాత ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. పచ్చని పంటలు పండే భూములను లాక్కొని, బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించిన హరీశ్‌రావు తమ సమస్యలను పరిష్కరించడంలో పూర్తి నిర్లక్ష్యం చేశారన్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజల పేరుతో దోచుకున్న డబ్బుకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉనికి కోసం అసత్య ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి చూపుతామని హామీ ఇచ్చిన హరీశ్‌రావు, అధికారులు ఇప్పుడు తమ ఇళ్ల వైపు కన్నెతి కూడా చూడడం లేదని తెలిపారు. మూసీ ప్రాజెక్టుకు, మల్లన్నసాగర్‌కు లింక్ పెట్టి బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ముందుకు వస్తే స్వాగతిస్తామని, అందుకు భిన్నంగా ఎవరు మాట్లాడినా ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో గజ్వేల్ ఏఎంసీ డైరెక్టర్ నర్సింహారెడ్డి, తొగుట పీఏసీఎస్ మాజీ చైర్మన్ కూరాకుల మల్లేశం, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పల్లెపహాడ్ మాజీ ఉపసర్పంచ్ రమేశ్, స్వామి, రాములు, లక్ష్మణ్, లష్కర్ సత్తయ్య, మల్లేశం, ధర్మారెడ్డి పాల్గొన్నారు.