జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్...
కామారెడ్డి (విజయక్రాంతి): అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రజాపాలనపై నాలుగు పథకాలకు సంబంధించిన వాటికి దరఖాస్తులు సమర్పించిన వారికి వార్డ్ సభలో ఆమోదం పొందడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వార్డు సభల్లో సమర్పిస్తున్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వార్డు సభలో ముసాయిదా జాబితాను చదవడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియపరచాలని అన్నారు.
అట్టి జాబితాలో పేరు రానివారు దరఖాస్తులు సమర్పించ వచ్చని, దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని, అట్టి దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయంలో గాని తహసీల్దార్ కార్యాలయంలో గానీ సమర్పించవచ్చని తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... రేషన్ కార్డుల కొరకు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇళ్ల స్థలాలు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత కలిగిన వారందరికీ లబ్ధి కలిగే వరకు దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, మున్సిపల్ కమీషనర్ స్పందన, వార్డు కౌన్సిలర్ లతా శ్రీనివాస్, మున్సిపల్ డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, మున్సిపల్ సిబ్బంది, వార్డులోని ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.