- డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపుతో నిరూపించుకున్న ప్రభుత్వం
- విద్యార్థుల సంక్షేమమే ప్రాధాన్యంగా నిర్ణయం
- డైట్‌పై 40 శాతం, కాస్మొటిక్స్‌పై 212 శాతం పెంపు
- ప్రభుత్వంపై ఏటా రూ.540 కోట్ల అదనపు భారం
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమను చాటుకున్నది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగానే గురుకులాల విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచుతూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అక్టోబర్ 31న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపుతో ఏటా ప్రభుత్వంపై రూ.540 కోట్ల అదనపు భారం పడనున్నది.
ఈ ఖర్చును లెక్క చేయకుండా అధికారుల కమిటీ సిఫార్సులను సీఎం రేవంత్‌రెడ్డి యథాతథంగా ఆమోదించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షలకు పైగా విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే కృత నిశ్చయంతో ఏడేండ్ల తర్వాత మెస్, కాస్మొటిక్ చార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కమిటీ చెప్పినకంటే ఎక్కువే పెంపు
2017 మే 23 తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లోని 3 నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు డైట్ చార్జీ రూ.950, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు డైట్ చార్జీ రూ.1,100, ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థులకు రూ.1,500లుగా ప్రభుత్వం చెల్లించేది.
అయితే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే వీటిని పెంచాలని డిమాండ్ రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. పలు అంశాలు పరిశీలించిన కమిటీ 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.1,200, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,400, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ.1,875 చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
కానీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.1,330, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,540, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ.2,100 చెల్లించాలని నిర్ణయించింది. గతంతో పోలిస్తే చార్జీలను 40 శాతం పెంచడం విశేషం.
కాస్మొటిక్స్‌పై 200 శాతానికి పైనే
డైట్ ఖర్చుతో పోలిస్తే కాస్మొటిక్ చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. 3 నుంచి 7వ తరగతి వరకు విద్యార్థునులకు కాస్మొటిక్ చార్జీల కింద రూ.55 లను చెల్లిస్తుండగా దానిని ప్రస్తుతం రూ.175లకు ప్రభుత్వం పెంచింది. 8 నుంచి 10వ తరగతి, పదకొండేళ్లపైన విద్యార్థినులకు రూ.75 నుంచి రూ.275లకు పెంచింది. ఈ పెరుగుదల 200 శాతానికి పైమాటే.
ఇదిలా ఉండగా 3 నుంచి 7వ తరగతి వరకు బాలురులకు రూ.62 నుంచి రూ.150లకు పెంచగా, ఇది గతంతో పోలిస్తే 141.93 శాతం అధికం. 8 నుంచి 10వ తరగతి, పదకొండేళ్ల పైన బాలురకు రూ.62 లను రూ.200లకు పెంచింది. గతంలో చెల్లించే దానితో పోలిస్తే ఇది 222.58 శాతం అధికం. అయితే అన్ని తరగతులు, విద్యార్థినులు, విద్యార్థులకు కలిపి చెల్లించే కాస్మొటిక్ చార్జీలను ప్రభుత్వం సగటున 212 శాతం పెంచింది.
గతంలో నిర్లక్ష్య ధోరణి!
గురుకులాల పట్ల గత ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. 2023 జూలైలో డైట్ చార్జీలు పెంచుతున్నట్టు అప్పటి సీఎం కేసీఆర్ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. ఆ తర్వాత నాలుగు నెలలు అధికారంలో ఉన్నప్పటికీ చార్జీలు పెంచలేదు. దీంతో 2017లో ఉన్న చార్జీలే వర్తించాయి.
అయితే ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు క్రెడిట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే పెంపుపై నిర్ణయం జరిగిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన చార్జీల పెంపు కంటే కేవలం 10 శాతం అధికంగా పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని వారి ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ నిజంగా గురుకులాల విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకున్న వెంటనే పెంచేవారని, కాలయాపన చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసేవారు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నిర్లక్ష్య ధోరణితోనే లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందలేదని మండిపడుతున్నారు.
డైట్ ఛార్జీల పెంపు (రూపాయల్లో..)
క్యాటగిరి విద్యార్థులు గతంలో సబ్ కమిటీ పెంచిన శాతం
చార్జీలు ప్రతిపాదన చార్జీ
3-7 తరగతి 2,77,877 950 1,200 1,330 40
8-10 2,59,328 1,100 1,400 1,540 40
ఇంటర్-పీజీ 2,28,500 1,500 1,875 2,100 40
7,65,705
క్యాటగిరి తరగతి గతంలో పెంచిన శాతం
చార్జీలు చార్జీలు
బాలికలు 3 నుంచి 7 55 175 218.18
8 నుంచి 10, 75 275 266.66
పదకొండేళ్లపైన
బాలురు 3 నుంచి 7 62 150 141.93
8 నుంచి 10 62 200 222.58
పదకొండేళ్లపైన