బెల్లంపల్లి (విజయక్రాంతి): నిరుపేద ప్రజలకు సేవ చేయడంలో కాక కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రిలో తన కూతురు గడ్డం వర్ష ఆధ్వర్యంలో నెన్నల్ మండల ప్రజలకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తన కూతురు ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు సహకరించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల సహకారంతో వెయ్యి మందికి కంటి పరీక్షలు నిర్వహించే అవకాశం కలిగిందన్నారు.
ఇదే సహకారాన్ని భవిష్యత్తులో అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రానున్న కాలంలో తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రైతులకు సంబంధించిన భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూతురు గడ్డం వర్ష, సతీమణి గడ్డం రామ, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ఎం.మల్లయ్య, మాజీ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ బండి ప్రభాకర్, ఎంపీటీసీ బొమ్మన హరీష్ గౌడ్, సీనియర్ నాయకులు ఎంవి. నర్సింగరావు, మునిమంద రమేష్, కంటి వైద్యు నిపుణులు డాక్టర్ అజయ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.