హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): త్వరలో జరుగనున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థిని సాధ్యమైనంత త్వరగానే పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు మరింతగా ఊపందుకునేలా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో పార్టీ రాష్ర్ట ఇన్‌చార్జి సునీల్ బన్సల్, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ హాజరయ్యారు.
పార్టీ సభ్యత్వ నమోదు, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ర్టంలో పార్టీని మరింత బలోపేతం చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై నేతలు కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో వివిధ అంశాలపై పార్టీ చేపట్టే కార్యక్రమాలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాలను ఏలేటి మీడియాకు వివరించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 23, 24 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పర్యటించి పరిశీలన చేసి.. 25వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ర్టంలో పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్‌ను మరింత ఉత్సాహంగా, పెద్దఎత్తున కొనసాగేలా ఎజెండా రూపొందించినట్లు తెలిపారు.
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లేలా చర్చించామని వివరించారు. ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పవార్, పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఉన్నారు.