30-04-2025 12:41:40 AM
భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్
చర్ల, ఏప్రిల్ 29, (విజయ క్రాంతి) మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, వారికి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం చర్ల పోలీసుల ఆధ్వర్యంలో చర్ల మండలంలోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన ఎర్రంపాడులో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఈ గ్రామంలో ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులందరితో సమావేశమై అక్కడ నివసించే మహిళలకు,చిన్న పిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారధ్యంలో ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని,అదేవిధంగా నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు సూచించారు.ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజువర్మ,ఎస్త్స్ర లు కేశవ,కార్తీక్,స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు