ఐజి సత్యనారాయణ...
లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు..
43 మందిపై కేసులు నమోదు చేశాం..
పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలో గురువారం జరిగిన ఆందోళనలు, క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కుర్చీల ధ్వంసం ఘటనలపై చట్ట ప్రకారం వ్యవహరిస్తామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ను శుక్రవారం సాయంత్రం ఐజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రూపేష్, డీఎస్పీ రవీందర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్టీ జోన్-2 లో ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన ప్రజా పాలన గ్రామసభల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయని తెలిపారు. గద్వాల, పటాన్ చెరులో మాత్రం అధికార పార్టీలో గ్రూపు సమస్యలతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. పటాన్ చెరు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపట్టినప్పటికీ వెంటనే క్యాంపు కార్యాలయానికి దూసుకెళ్ళడం కుర్చీలు ధ్వంసం చేయడంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము.
ఈ ఘటనపై 43 మందిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాము. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట పారిశ్రామికవాడలతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యం. పరిశ్రమలు సీఎస్ఆర్ ద్వారా కానీ నేను సైతం ద్వారా గాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. నార్త్ నుంచి వస్తున్న లేబర్ పై మర్డర్స్, మైనర్ లపై రేప్ కేసులు నమోదు అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు అలర్ట్ గా ఉండాలి. రాత్రిపూట పెట్రోలింగ్ చేసే సమయంలో పోలీసులు ఆయుధాలు ధరించాలి. 65వ నెంబర్ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. గత సంవత్సరం 18 రాబరీ కేసుల నమోదైతే 17 కేసులను పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అలర్ట్ గా ఉందని ఐజీ తెలిపారు.