22-03-2025 01:31:21 AM
నేడు చెన్నై వేదికగా అఖిలపక్ష సమావేశం
హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్
చెన్నై, మార్చి 21: జనాభా ప్రాతిపదికన నిర్వహించే డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా చెన్నై వేదికగా శనివారం అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావే శానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో న్యాయమైన డీలిమిటేషన్‌ను సాధిస్తామని తమిళనాడు ముఖ్యమం త్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండాలంటే న్యాయమైన డీలిమిటేషన్ కీలకమని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశం సందర్భంగా శుక్రవారం స్టాలిన్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో స్టాలిన్ మాట్లాడుతూ..‘జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరవుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ , పంజాబ్ నాయకులకు నా హృదయపూర్వక స్వాగతం. డీలిమిటేషన్‌పై మార్చి 5న జరిగిన అఖిలపక్షం ఓ మైలురాయి.
2026లో జరిగే డీలిమిటేషన్ జనాభా ఆధారంగా జరిగితే పార్లమెంట్‌లో మన ప్రాతినిథ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది కేవలం ఎంపీల సంఖ్య గురించి మాత్రమే కాదు. రాష్ట్ర హక్కుల భంగం గురించి. అందుకే మార్చి 5న నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ హాజరయ్యాయి.
తమిళనాడులోని 58 పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టి ఒక్కటయ్యాయి. ఇది ప్రజాస్వామ్యం, న్యాయంపట్ల తమిళనాడు నిబద్ధతను తెలియజేస్తుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ను తొలుత తమిళనాడు వ్యతిరేకించింది. దీనికి అన్ని రాష్ట్రాలు చేతులు కలపడంతో ప్రస్తుతం ఇది ఒక జాతీయ ఉద్యమంగా మారింది’ అని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
చెన్నై వెళ్లిన సీఎం రేవంత్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానం మేరకు జనాభా ఆధారిత డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా శనివారం జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్‌రెడ్డి చెన్నై వెళ్లారు. ఈ సమావేశంలో సీఎం తెలంగాణ వాదనను అఖిలపక్ష నేతల ముందు వినిపించనున్నారు. సమావేశం అనంతరం అఖిలపక్ష నేతలతో కలిసి సీఎం విలేకరులతో మాట్లాడనున్నారు.
మరోవైపు ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం కసరత్తు చేస్తున్న డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.