ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి టీచర్‌కి కూడా ఓటుహక్కు అవకాశం కల్పించాలి. రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్లతోపాటు సెకండరీ గ్రేడ్ టీచర్లకి కూడా ఈ సదుపాయం ఉండాలి. దేశంలో 70% ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయిలో బోధన చేసేవారు ఉన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 80% టీచర్లు ప్రాథమిక స్థాయి టీచర్లు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు విద్యావ్యవస్థకు మూలాధారం. సాధారణ ఎన్నికల్లో పౌరులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు అవకాశం ఉంటుంది కదా. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రతి టీచర్‌కి ఓటుహక్కు అవకాశం కల్పించడం న్యాయం. ఆర్టికల్ 171 ప్రకారం ఏర్పడిన మండలిలో తమ సమస్యల పరిష్కారానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఉపాధ్యాయులపట్ల వివక్ష లేకుండా అందరికీ ఓటుహక్కు కల్పించడం ఎంతో సముచితంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం ఈ విషయంలో దృష్టి సారించాలి. అన్ని రకాల టీచర్ వర్గాలకు ఓటుహక్కు వుండేలా చూడాల్సిన అవసరం ఉంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడికి ఎలాగైతే ఓటుహక్కును పొందే అవకాశం ఉంటుందో, అదే పద్ధతిలో ఉపాధ్యాయ ఎన్నికల్లో ప్రతీ టీచర్‌కు ఆ హక్కును కల్పించడానికి ఇప్పటికైనా కృషి జరగాలి. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కేవలం రాజకీయ పునరావాసం కోసం అన్నట్టుగా చూడరాదు. ఉపాధ్యాయుల సమస్యలపట్ల చిత్తశుద్ధి ఉన్నవారు ఎమ్మెల్సీగా గెలుపొందితే ప్రజాస్వామ్యానికి ఒక అర్థం పరమార్థం లభించినట్టు అవుతుంది.
- రావుల రామ్మోహన్‌రెడ్డి