- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
- మూసీ పునరావాస మహిళల ఉపాధి కల్పనకు రూ.3.44 కోట్ల చెక్కుల పంపిణీ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మూసీ పునరావాసంలో భాగంగా బాధితులందరినీ ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖమంత్రి సీతక్క పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్ట్‌లో పునరావాసం పొందిన 172 కుటుంబాలకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రజాభవన్‌లో 3.44 కోట్ల చెక్కులను మంత్రి సీతక్క శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేటప్పుడు ఉండే బాధ ఎలా ఉంటుందో తెలుసునని అన్నారు.
పునరావాసంలో బాధిత కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండేందుకే ప్రతీ మహిళకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. వీటిలో రూ.1.40 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ కాగా, మిగతా రూ.60 వేలు మూడేళ్లలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివిధ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
పునరావాసం పొందిన బాధిత కుటుంబాలకు ఉచిత విద్య, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశం, డబుల్ బెడ్ రూమ్ తదితర సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. మూసీనది పరిరక్షణ ప్రాజెక్ట్‌లో బాధితులకు న్యాయం చేకూర్చేలా జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం కృషి అభినందనీయమని ప్రశంసించారు.
ఇక నుంచి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో జీహెచ్‌ఎంసీ పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించారన్నారు.
పునరావాస ప్రాంతంలో మంచి నీళ్ల సమస్య లేకుండా ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజ్, మూసీ జేడీఎం గౌతమీ, ఈడీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు పాల్గొన్నారు.