calender_icon.png 26 October, 2024 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు అండగా ఉంటాం

26-10-2024 12:40:11 AM

14వ ప్రాపర్టీ షో ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు నిర్మాణ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైటెక్స్‌లో 14వ ప్రాపర్టీ షోను ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ నిర్మాణ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్‌ఓసీలతో పాటు పాలనాపరమైన అనుమతులు సులభతరం చేయనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వంతో ఏ సమయం లోనైనా, ఏ విషయంలోనైనా సంప్రదించి చర్చలు జరపడానికి క్రెడాయ్, ట్రెడాయ్‌లు సంయుక్తంగా ఒక కమిటీని నియమించుకోవాలని సూచించారు.

హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడికి తరలివస్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ అభివృద్ధిలో రియల్టర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. నగరం చుట్టూ ఓఆర్‌ఆర్‌ను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు.

మెట్రో విస్తరించడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సన్నహాలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో స్కిల్ యూనిర్సిటీ ఏర్పాటు అవుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విశ్వవిద్యాలయం నెలకొల్పుతున్నట్టు చెప్పారు.