24-04-2025 10:03:42 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై దాడి చేసి 27 మందిని చంపిన ఉగ్రవాదుల చర్యలను కామారెడ్డి జిల్లా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని దేశ ప్రజానీకం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ... జమ్మూ కాశ్మీర్ లోని పుల్కామ్ పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వెళ్లిన 27 మంది పర్యాటకులను విచక్షణారహితంగా దాడి చేసి తుపాకులతో కాల్చి చంపిన ఉగ్రవాద చర్యలను దేశ ప్రజానీకం ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఈ దాడిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని మరి కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన వసుదైక కుటుంబ భావన కలిగిన భారతదేశంలో ఇటువంటి విద్వేష విభజన రాజకీయాలను దేశం ఏనాటికి అంగీకరించదని అన్నారు .పరస్పర సహకారం సహనంతో ప్రపంచ అభివృద్ధి జరుగుతుందే తప్ప ప్రజల ఆచారాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లపై ద్వేషం పెంచుకోవడం వల్ల ఒరిగేది ఏమీ లేదని అన్నారు. పర్యాటకులపై జరిగిన ఉన్మాద చర్యలకు వ్యతిరేకంగా బాధిత కుటుంబాలకు అండగా దేశ ప్రజానీకం నిలబడాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా అన్యాయం జరిగిన కుటుంబాలకు అన్ని రకాలుగా సహాయం అందించాలని డిమాండ్ చేశారు .దేశంలో ఆర్మీలో 2 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి దేశభద్రతకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలు పునారవృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ ప్రజలు ఐక్యతతో ఇలాంటి దుశ్చర్యలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్త నరసింహులు, మోదం అరుణ్ కుమార్, శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు.