calender_icon.png 28 February, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊటనీళ్లు తోడలేకే సొరంగం పనులు ఆపేశాం

28-02-2025 01:33:22 AM

  • సమైక్యాంధ్ర పాలకుల కుట్రతోనే ఎస్సెల్బీసీ నిర్మాణం
  • హడావిడిగా పనులు చేయడం వల్లే ప్రమాదం
  • గల్లంతైన వారిని గుర్తించడంలో సర్కారు నిర్లక్ష్యం
  • మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

నల్లగొండ, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : ఎస్సెల్బీసీ సొరంగం నుంచి ఊటనీరు తోడేందుకు నెలకు కోటిన్నరపైగా ఖర్చుచేయాల్సి రావడం, ఊటను బయటకు పంపే ప్రయత్నాలన్నీ విఫలమవడంతోనే గత ప్రభుత్వం పనులపై ముందుకు వెళ్లలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర పాలకుల కుట్రతోనే ఎస్సెల్బీసీ ప్రాజెక్టు పురుగుపోసుకుందని ఆక్షేపించారు.

గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. టన్నెల్ పనులతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతుందని పేర్కొన్నారు. సొరంగం పనులకు వినియోగిస్తున్న సాంకేతికత సరైంది కాదని తాము ఆ నాడే చెప్పామన్నారు. కాంగ్రెస్ సర్కారు సరైన అంచనాలు లేకుండా రక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా హడావిడిగా పనులు ప్రారంభించిన కారణంగానే సొరంగంలో ప్రమాదం జరిగిందని ఆరోపించారు.

టన్నెల్లో గల్లంతైన 8 మంది ఆచూకీ గుర్తించడంలో సర్కారు దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. రెస్కూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న మంత్రులు నీళ్లు, వాటర్ అంటూ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రమాదాన్ని రాజకీయానికి వాడుకోవడం లేదని, ప్రభుత్వ తప్పులను మాత్రమే ఎత్తిచూపుతున్నామన్నారు.

తాను విద్యుత్శాఖ మంత్రిగా ఉన్నప్పుడే సొరంగం పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించి ముందుకు వెళ్లడం మంచిది కాదని నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, బీఆర్‌ఎస్ నాయకులు రేగట్టే మల్లికార్జున్రెడ్డి, భువనగిరి దేవేందర్ తదితరులున్నారు.