calender_icon.png 30 September, 2024 | 6:49 PM

బాధితులకు అండగా ఉంటాం: మాజీ మంత్రి జోగు రామన్న

30-09-2024 04:39:55 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి) : నిరుపేదల ఇండ్లను కూల్చే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని, పేదలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే వారికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న స్పష్టం చేశారు. ఇటీవల అధికారుల బృందం సర్వే చేసి వెళ్ళడంతో తీవ్ర భయందోలనకు గురవుతున్న ఖానాపూర్ చెరువు పరిసరాలైన ఖానాపూర్, కొలిపుర, తిర్పెల్లి, అంబేద్కర్ నగర్ తదితర కాలనీలలోని సోమవారం పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. 

పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని, ఎంతటివారినైనా అడ్డుకుని అండగా ఉంటామని జోగు రామన్న స్పష్టం చేశారు. ఎటువంటి ఆందోళనకు గురి కావొద్దని ధైర్యం చెప్పారు. కడుపు కాలి రెండు మాటలంటే వారిపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. దశాబ్దాల కాలంగా నిరుపేదలు ఇండ్లు నిర్మించుకుని జీవిస్తుంటే ప్రభుత్వం వారిపై దయ చూపకుండా వ్యవహరించడం సరికాదన్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఇక్కడి వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించారని గుర్తు చేశారు.

చెరువును కబ్జా చేశారని ఆరోపిస్తూ సర్వే జరపడంతో పేద ప్రజలు భయందోలనకు గురవుతున్నారని, కొందరు వృద్ధులైతే తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు కూలుస్తామంటే ఉపేక్షించేది లేదన్న ఆయన... అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రభుత్వం నిరుపేదల ఇండ్లను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డబ్బులను సంపాదించడమే లక్ష్యంగా ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో నాయకులు రోకండ్ల రమేష్, అలాల్ అజయ్, సాజిదోద్దీన్, విజ్జగిరి నారాయణ, పవన్ నాయక్, ధర్మపాల్, స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.