calender_icon.png 18 October, 2024 | 8:57 AM

బాధితులకు అండగా ఉంటాం

16-10-2024 01:56:21 AM

అర్జీలను త్వరగా పరిష్కరిస్తం 

పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క 

గాంధీభవన్‌లో ముఖాముఖి కార్యక్రమం

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): తమ సమస్యల పరిష్కారానికి గాంధీభవన్‌కు వచ్చే ప్రజలకు సహకరిస్తామని, నిబంధనలకు అనుగుణంగా ఉన్న అర్జీలను పరిష్కరిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఈసందర్భంగా ఆమెకు పలువురు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ కార్యకర్తలకే అవకాశం కల్పించాలని ఆ పార్టీ నేతలు సూచించారు. కబ్జాలకు గురైన తమ భూములు తమకే దక్కిలా చూడాలని, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని, 98 డీఎస్సీ అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలు కల్పించాలని వేడుకున్నారు.

అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు ప్రభుత్వ అధికారులను తొలగించాలని, బీఆర్‌ఎస్ హయాంలో తమపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డగోలుగా చేసిన నియామకాలపై విచారణ చేపట్టాలన్నారు.

వెంటనే పలువురు జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క ఫోన్‌లో మాట్లాడి నిబంధనలకు అనుగుణంగా అర్జీలు తక్షణం పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ భూమికి సంబంధించిన సమస్యలు, వికలాంగులు పెన్షన్ కోసం తమ సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు.

జర్నలిస్టు సుభాశ్ అకాల మరణం బాధాకరమని, ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాల్లో సుభాశ్ చురుగ్గా పాల్గొనే వారని గుర్తు చేశారు. దామగుండం ప్రాజెక్టుకు జీవో ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో మరోలా మాట్లాడటం సరైన విధానం కాదన్నారు. బీజేపీది గాడ్సే సిద్ధాంతం కాగా, కాంగ్రెస్‌ది గాంధీ సిద్ధాంతమని ఈ రెండు పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కావన్నారు.