* ఉద్యోగులకు ఇవ్వవలసిన సదుపాయాలు కల్పిస్తే చాలు
* ఇప్పటికే ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన ఒక అడుగు ముందు వరుసలో ..
* టీజీవో సంఘానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తాం
* విజయక్రాంతితో టీజీవో జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ ముదిరాజ్
మహబూబ్‌నగర్ జనవరి 25 (విజయక్రాంతి): ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజా సంక్షేమలను తెలియజేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల దరి చేర్చుతూ నిరంతరం అలుపెరుగని శ్రమజీవిలా ఉద్యోగులం దరం కృషి చేస్తామంటూ విజయక్రాంతితో టీజీవో జిల్లా అధ్యక్షులు ఎస్ విజయ్ కుమార్ ముదిరాజ్ సంభాషించారు.
టీజీవో లక్ష్యం ఏంటి..
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహబూబ్ నగర్ శాఖ ముందు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా ప్రజల దరి చేరుస్తాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అంకురార్పణ చేసిన విద్యానిధికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1200 మంది ఉద్యోగులు ఏకతాటపైకి వచ్చేందుకు సాయశక్తులుగా జిల్లా కలెక్టర్ సూచన మేరకు సన్నద్ధమవుతున్నాం.
టీజీవో పరిధిలోని ఉద్యోగులందరి వేతనాన్ని విరాళంగా అందించేందుకు ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సంఘం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. టీజీవో శాశ్వతభానాన్ని మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసుకున్నందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంది..
ఉద్యోగులు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ముందుకు సాగడం అస్సలు జరగదు. ప్రభుత్వానికి పలు సానుకూల మైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మన ప్రభుత్వం అనగా ప్రజా ప్రభుత్వం సఫలీకృతం అయిందనడంలో సందేహం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రాథమిక హక్కు అయినటువంటి జీతాలను ఒకటవ తారీఖున జమ చేయడం అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో క్లిష్టమైనటువంటి దశ నుండి ఈనాటి చాలామంది వారి యొక్క సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రమోషన్లను పొందడం జరిగింది. కొత్తగా వివిధ శాఖల తరఫునుంచి నియామక పత్రాలు అందించి చదువుకున్న గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ తగు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రజా ప్రభుత్వం ఒక అడుగు ముందు వరుసలోనే ఉంది.
ఉద్యోగులకు ప్రభుత్వం చేయవలసినవి చేస్తే చాలు..
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగుల విరమణ అనంతరం వారి యొక్క గౌరవ జీవితానికి సహకారం అందించాలి. పిఆర్సి రికమండేషన్ ను తక్షణమే అమలుపరచి నూతన పేస్కేళ్లను అమలు పరచాలి. పెండింగ్ డిఎల్ లను ఉద్యోగుల ఖాతాలకు జమ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మెడికల్ రియంబర్స్మెంట్ పై తగు చర్యలను తీసుకుంటూ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కోరుతున్నాం.