calender_icon.png 29 December, 2024 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవా ప్రయాణికుల కష్టాలను తీర్చాం

07-10-2024 02:05:19 AM

స్లిప్ జర్నీ అగచాట్లు ఇకపై ఉండవు

పదేళ్లలో తెలంగాణ రైల్వేల దశ మార్చేశాం

గోవా రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): సికింద్రాబాద్ నుంచి తొలిసారిగా నేరుగా గోవాకు రైలును ప్రారంభించడంతో తెలంగాణ నుంచి గోవా వెళ్లే ప్రయాణికుల కష్టాలు తీర్చామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. గతంలో నగరం నుంచి గుంతకల్ వెళ్లి అక్కడి నుంచి మరో రైలుకు మన బోగీలను తగిలించి గోవాకు వెళ్లే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.

ఆదివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వాస్కోడగామాకు కొత్త రైలును కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తరపున నవరాత్రుల కానుకగా గోవాకు వెళ్తున్న ఈ బై-వీక్లీ రైలును ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కొత్త రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు.. ముఖ్యంగా పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు.

సికింద్రాబాద్ గోవా మధ్య రైళ్లన్నీ 100 శాతం ఆక్యుపెన్సీతో వెళ్లడంతో చాలామంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికొచ్చిందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేసిన వెంటనే ఆయన కొత్త రైలును ప్రకటించారని తెలిపారు.

గోవా రైలు ఇచ్చినందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, గోవా రాష్ట్రాల పర్యాటక రంగాభివృద్ధికి, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతానికి కూడా ఈ రైలు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి... గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతుందన్నారు. 

కాజీపేట ఆర్‌ఎంయుతో పెద్ద ఎత్తున ఉపాధి 

రూ.521 కోట్లతో కాజీపేటలో ప్రతిష్ఠాత్మకంగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయు)ను కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. మొదట దీన్ని పీరియాడిక్ ఓవర్ హాలింగ్ గానే అనుకున్నప్పటికీ.. ప్రధాని చొరవ వల్ల అప్‌గ్రేడ్ చేయించారని అన్నారు. ఇక్కడ వ్యాగన్ల ఓవర్ హాలింగ్‌తోపాటు రైల్వే కోచ్‌లు, ఇంజన్లు, వ్యాగన్లు తయారవుతాయని తెలిపారు.

దీని ద్వారా 3 వేల మందికి ప్రత్యక్షంగా అనేక మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని స్పష్టం చేశారు. తెలంగాణలో రైల్వేలకు సంబంధించి గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. కొత్త రైల్వే లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చాలావరకు పూర్తయ్యాయని వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపుగా విద్యుదీకరణ పూర్తయిందన్నారు.

సికింద్రాబాద్ (రూ.715 కోట్లు), కాచిగూడ (రూ.425 కోట్లు), నాంపల్లి (రూ.429 కోట్లు) స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందని చెప్పారు. రూ.415 కోట్లతో చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

రూ.2,220 కోట్ల వ్యయంతో 40 రైల్వేస్టేషన్లను ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నామని వివరించారు. రూ.4,109 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం -మల్కాన్‌గిరి మధ్య 173 కిలోమీటర్ల ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడిందని తెలిపారు. సికింద్రాబాద్ నాగ్‌ఫూర్ మధ్య ఇటీవలే వందేభారత్ రైలును కూడా ప్రారంభించుకున్నట్టు గుర్తుచేశారు.