03-04-2025 10:53:12 PM
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..
కామారెడ్డి (విజయక్రాంతి): మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ & రమాబాయి దంపతుల మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ... సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఈ మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే & సవిత్రీబాయి ఫూలే దంపతులు సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం, మహిళా విద్యకు అందించిన ప్రాధాన్యత మనకు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించి, పేద, అణగారిన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేశారు అని గుర్తుచేశారు. మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ ద్వారా యువత స్ఫూర్తిగా అందిపుచ్చుకుని, సమాజ సేవ, విద్య, హక్కుల పరిరక్షణలో తమ పాత్రను సక్రమంగా నిర్వర్తించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో సమానత్వం, న్యాయం, సామరస్యత కోసం ప్రతి ఒక్కరూ ఈ మహనీయుల ఆశయాలను పాటించాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం మాట్లాడుతూ... మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మనందరం ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, లింగా గౌడ్ సంగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, మహిళా నేతలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.