04-04-2025 12:08:02 AM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. ఏప్రిల్ 3(విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్ కార్డు లబ్దిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం జిల్లాలోని నర్వ మండల కేంద్రంలోని 4 చౌకధర దుకాణంలో కలెక్టర్ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి పార్వతమ్మ అనే రేషన్ కార్డుదారురాలికి 18 కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట లో మొదటగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని ఆమె తెలిపారు. అందరి ఆరోగ్యం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. జిల్లాలోని నారాయణ పేట, మక్తల్, కొడంగల్ నియోజక వర్గాలలో ఈ నెల 2న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయిందని చెప్పారు.
ఇప్పుడు నర్వ మండలంలో ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో డైనమిక్ రిజిస్టర్ ఆధారంగా అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని ఆమె ఆదేశించారు. నర్వ మండలంలో మొత్తం 18 రేషన్ దుకాణాలకు గాను 101 క్వింటాళ్ల 40 కిలోల బియ్యం కోటా ప్రతినెల ఉంటుందని, ఇప్పటికీ 12 రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా చేయడం జరిగిందని, మిగతా 6 దుకాణాలకు శుక్రవారం వరకు బియ్యం సరఫరా చేస్తామని తహసిల్దార్ మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్ ఐ కుర్మయ్య, ఎంపిఓ, రేషన్ దుకాణం డీలర్ జలంధర్ తదితరులు పాల్గొన్నారు.