05-04-2025 01:48:27 AM
నల్లగొండ, ఏప్రిల్ 4 : రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. కనగల్ మండలం జీ.యడవల్లిలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజీవ్ యువ వికాస పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశం మేరకు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామాభివృద్ధికి అవసరమైతే ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానన్నారు. రాజీవ్ యువ వికాస పథకంలో స్థానికత చాలా ముఖ్యమని, ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కింద గరిష్టంగా రూ. నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం పొందేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.
దరఖాస్తుదారులు దరఖాస్తుతోపాటు రేషన్ కార్డు జతచేయాలని, రేషన్ కార్డు లేకుంటే కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలని చెప్పారు. తహసీల్దార్లు 24 గంటల్లో ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. దరఖాస్తుదారులు వివరాలను పారదర్శకంగా సమర్పించాలని, అందరూ ఒకేరకం యూనిట్కు దరఖాస్తు చేసుకోవద్దని సూచించారు. అనంతరం కలెక్టర్ యడవల్లి చెరువు అలుగును పరిశీలించారు.
అలుగు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలని ఆర్డీఓ, ఎంపీడీఓలను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ.మాన్యనాయక్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి రాజ్కుమార్, సహాయ బీసీ సంక్షేమ అధికారి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.