calender_icon.png 22 February, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంత్ సేవాలాల్ ఆశయాల సాధనకు కృషిచేయాలి

19-02-2025 01:21:29 AM

కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 18 ( విజయ క్రాంతి ): శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత ఆశయాలను సాధిస్తూ ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదగాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం  శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని  రావిభద్ర రెడ్డి గార్డెన్స్ నందు  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సంత్ సేవాలాల్ చిత్రపటానికి  జిల్లా కలెక్టర్ , బంజారా ఉత్సవ కమిటీ ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ  సద్గురు సంతా సేవాలాల్  మహారాజ్ ఆశయాలను, వారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని జీవితంలో భారత పౌరులుగా ఉన్నత స్థాయికి ఎదగాలని,  ముఖ్యంగా ఆర్థికంగా ఎదగాలంటే ఎటువంటి చెడు వ్యసనాలకు గురికాకుండా  మంచి మార్గంలో నడవాలని అన్నారు.

సంత్ సేవాలాల్ బంజారా వారి కొరకే కాకుండా యావత్  జాతికి కూడా ఆయన మార్గదర్శం అన్నారు.ముఖ్యంగా  పేద స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలంటే  తర తరాలు మార్చేది చదువు ఒక్కటే  అని కలెక్టర్ హితవు పలికారు. జీవితంలో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి  సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకొని ,

తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తెచ్చే విధముగా విద్యార్థులు చదవాలని, జీవితంలో ముఖ్యంగా పదవ తరగతి అనేది చాలా కీలకమైనదని దానికి అనుగుణంగా జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు  నిర్వహించి పదవ తరగతి చదివే విద్యార్థులు నూరు  శాతం ఫలితాలు సాధించేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభ రాణి, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కోశాధికారి ఉపేందర్ రెడ్డి,  బంజారా ఉత్సవ కమిటీ పాల్గొన్నారు.