- పనిచేసే వారికే పదవులు దక్కుతాయి
- బీఆర్‌ఎస్ బిల్లులు ఇవ్వనందుకే సర్పంచుల ఆత్మహత్యలు
- రాహుల్‌గాంధీని ప్రధాని చేసే వరకు విశ్రమించొద్దు
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే వారికే పదవులు దక్కుతాయని.. ప్రతిఒక్కరూ పార్టీ కోసం కట్టుబడి పనిచేయాలని ఆయన సూచించారు. గ్రామస్థాయిలో కార్యకర్తల కృషి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వ ఫలాలు నిజమైన పేదలకు అందినప్పుడే తమ లక్ష్యం నేరవేరుతుందన్నారు. గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంగటన్ రాష్ట్రస్థాయి సమావేశం ఆ సంఘం నాయకుడు రాచమల్ల సిద్ధేశ్వర్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీకి పంచాయతీలు అంటే ఎంతో ఇష్టమని.. అందుకే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా హక్కులు కల్పిస్తే అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అమలు చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ గ్రామ పంచాయతీలకు గౌరవం తీసుకొస్తే.. బీఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. అప్పటి ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతోనే చాలామంది సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అన్న కేసీఆర్.. తన కుటుంబాన్ని మాత్రమే బంగారంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ చేసిన రూ.8లక్షల కోట్ల అప్పుకు ఇప్పుడు అందరం వడ్డీలు కడుతున్నామని అన్నారు.
రైతు రుణమాఫీ, రైతు బంధు, బోనస్‌తోపాటు 50వేలకు పైగా ఉద్యోగాలు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీని ప్రజలు పట్టించుకోరన్నారు.
రాహుల్‌గాంధీని ప్రధాని చేసే వరకు ప్రతి కార్యకర్త విశ్రమించకుండా పని చేయాలన్నారు. పేదలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కులగణన చేయాలని కోరుతున్నారని, అందుకే మన రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి మొదటగా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయన్నారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం అదానీ, అంబానీలను పెంచి పోసిస్తోందని విమర్శించారు.
సోనియా, రాహుల్‌గాంధీలకు పదవుల మీద ఆశలేదని, మోడీకి మాత్రం ఫొటోల పిచ్చి ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని, ఈ దేశాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తున్నదని పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కాంగ్రెస్ కాపాడుతుంటే.. బీజేపీ అమ్మేస్తోందని ధ్వజమెత్తారు..