calender_icon.png 20 October, 2024 | 2:51 AM

బండితో కాదు అభ్యర్థులతో చర్చలు జరపాలి

20-10-2024 01:21:06 AM

  1. సంజయ్ ఏమన్న చదువుకున్నాడా, పరీక్ష రాసేది ఉందా?
  2. సీఎం రేవంత్‌రెడ్డివి శిఖండి రాజకీయాలు
  3. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్  

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): శిఖండి రాజకీయాల్లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ముందు పెట్టి చర్చలు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి డ్రామా చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్ ఏమన్న చదువుకున్నాడా, ఆయన పరీక్ష రాసేది ఉందా అని ప్రశ్నించారు.

పేపర్ లీకులు చేయమంటే చేస్తాడని, ఆయనతో చర్చలు జరపటం కాదని, 10 మంది విద్యార్థులను పిలిచి చర్చలు జరపాలని సూచించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాకుండా వికీపీడియా ప్రామాణికం అనడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

నాలుగు రోజులుగా ఎండ, వానా అనక ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో  ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని అన్నారు. అభ్యర్థులను పిలిచి వివరణ ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఉన్న తా ధికారులు కావాల్సిన యువతతోనే  ఇలా వ్యవహరిస్తున్నారంటే, మిగతా యువతతో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

 సీఎం స్పందించాలె..

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి అభ్యర్థులతో చర్చలు జరపాలని సూచించారు. లేదంటే వాళ్లు డిమాండ్ చేస్తున్నట్లుగా పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వారంతా ఊరికే వాయిదా వేయాలని కోరటం లేదన్నారు. మధ్యప్రదేశ్‌లో ఈవిధంగా జరిగితే కోర్టు తీర్పు తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్, శ్రీనివాస్ గౌడ్ , దాసోజు శ్రావణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. ప్రజా పాలన అంటూ పొంకనాలు కొట్టిన రేవంత్ రెడ్డి ఎందుకు ఈ నిరంకుశ నిర్భంధాలు పెడుతున్నాడని, ఎందుకు చర్చలు జరిపేందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పడిపోతదని బాధపడుతున్న నీ మిత్రుడు బండి సంజయ్‌ని మాత్రం సీఆర్పీఎఫ్ బలగాలతో అక్కడి పంపుతావని, మా పార్టీ నేతలు అక్కడికి వెళ్లితే పోలీసులను మొహరించావని మండిపడ్డారు.