10-04-2025 12:36:23 AM
ప్రతి ఒక్కరికి సంపూర్ణ పోషకాహారం అందాలి
అందరూ సమిష్టిగా కృషి చేయాలి
పోషణ్ పక్షం గోడ ప్రతులను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : పోషణ్ అభియాన్, పోషణ పక్షం లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా పోషణపక్షం ఏప్రిల్ 8వ తేదీ నుం చి 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 15 రోజుల పాటు నిర్వహించే క్రమంలో షెడ్యూల్ ప్రకారం రోజువారీగా కార్యక్రమా లు నిర్వహించాలని సిబ్బందికి సూచించా రు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోషణ పక్షం 2025పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పోషణ్ పక్షం గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంపూర్ణ పోషకాహారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని ఆన్నారు.
పోషణ్ సాంకేతికత సంప్రదాయాల సమ్మేళనంతో పిల్లలు మహిళలకు ఆరోగ్యకరమైన, పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో పోషణ లోపం ఏ ఊరిలో కనిపించకుండా చేసి, సరైన పోషణతో ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అంగన్వాడి సూపర్ వైజర్లు ప్రతి ఇంటింటికి తిరిగి సామ్-మామ్ పిల్లలను గుర్తించి వారికి మెరుగైన చికిత్స అందేలా చూడడంతో పాటు తల్లిపాలు, న్యూట్రిషన్ ఫుడ్, ఓ.ఎస్.ఐపై అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాను అనీమియా ముక్త్‌గా తీర్చిదిద్దేలా జిల్లాలోని ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో అనిమియా పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేలా యోగా, వ్యాయామం వంటి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారిణి మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, సంబంధిత అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.