calender_icon.png 28 December, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి

01-12-2024 01:24:31 AM

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నవంబరు 30 (విజయక్రాంతి): విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించనున్న 52వ బాలల జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నించడం అనేది విద్యార్థి దశలోనే అవలంభించినట్లయితే ఎన్నో శాస్త్రీయ ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు, అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల్లో ఆలోచన జ్ఞానాన్ని పెంపొందింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచం అజ్ఞానంలో మగ్గినప్పుడు భారతదేశం ప్రపంచానికి వెలుగులు నింపిందని, వేల సంవత్సరాల క్రితమే భారతదేశం శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని ముందుకెళ్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఈవో జనార్దన్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, పాఠశాల చైర్మన్ ఫాతిమారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి చాడ జయపాల్‌రెడ్డి, డీసీఈబీ సెక్రటరీ మారం స్వదేశీకుమార్, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ, కౌన్సిలర్ వేణుగోపాల్, మహ్మద్ అజీం, భగవంతయ్య, ఏనుగు ప్రభాకర్‌రావు, కర్ర అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.