- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్
- కేంద్రానికి పంపాల్సిన ప్రతిపాదనలపై చర్చ
జగిత్యాల, డిసెంబర్ 22 (విజయక్రాంతి): జగిత్యాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టే పలు అభివృద్ధి పనుల విష యంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఎంపీ అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆదివా రం కలిశారు. ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి సన్మానించిన అనంతరం నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేసే పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
కొత్తగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం ఎంపీ, ఎమ్మెల్యే సంయుక్త ప్రతిపాదనలతో ముఖ్యమంత్రికి వినతి చేశారు. జగిత్యాల పట్టణాన్ని అమృత్ కింద ప్రతిపాదించి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో పాటు మురికినీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు.
జగిత్యాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయం మంజూరుకు, నియోజకవర్గ పరిధిలోని బీర్పూర్ మండలంలో ఏకలవ్య పాఠశాల, కేజీబీవీ పాఠశాలకు స్థలంతో పాటు నిధుల కేటాయింపు ప్రతిపాదనలు పంపాలని కోరారు. జగిత్యాల రూరల్ మండలానికి కేజీబీవీ పాఠశాల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని, జగిత్యాల నియోజకవర్గంలో కృషి విజ్ఞానకేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ను చల్‌గల్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లిపూర్‌ను నూతన మండలంగా ప్రకటించాలని, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయాలని కోరారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలను పునర్విభజన చేయాలని కోరారు.
కాగా ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను కలిసి జగిత్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కోరగా, రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యే తాజాగా ఎంపీ అరవింద్‌ను ఢిల్లీలో కలిసి ఈ విషయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిసి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని కోరారు.