calender_icon.png 9 May, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితాలు త్యాగం చేశాం!

06-04-2025 12:00:00 AM

తెలంగాణ వస్తే బతుకులు బాగు పడతాయని ఉద్యమంలో తిరిగాం. కేసీఆర్ పిలుపునిస్తే ప్రభంజనంలా తరలి వెళ్లేవాళ్లం. తెలంగాణ వస్తేనే బతుకు బాగుపడుతుందనుకున్నాం. ఉద్యమం కోసం ఇడ్లు, వాకిళ్లు, ఆస్తులు పోగొట్టుకున్నాం. ప్రభుత్వ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచాం. లాఠీ దెబ్బలకు వెరవలేదు. కేసుల్లో ఇరుకున్నాం. ఉద్యమానికి నాయకత్వం వహించిన అప్పటి టీఆర్‌ఎస్ నేతల మాటలకు ఆకర్షితులమై, విలువైన జీవితాలను నాశనం చేసుకున్నామమని చెసపుతున్నాడు మలిదశ ఉద్యమకారుడు మహమ్మద్ రహీం. 

నాడు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేతత్వం గుండెల్లో నుంచి పుట్టింది. బయట ఒకమాట అంతర్లీనంగా మరోమాట మాట్లాడే వ్యక్తులు కాదు ఉద్యమకారులు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మా బిడ్డల భవిష్యత్తు కాదు యావత్తు తెలంగాణ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని భావించాం. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నింటిని పక్కన పెట్టేశాం. ఉద్యమం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొట్లాడినం. ఆనాడు కొట్లాడిన కొట్లాటకు చేసిన పోరాటానికి గత ప్రభుత్వం ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ఆనాడు చేసిన పోరాటం.. వదిలేసిన కుటుంబ బాధలు.. పోగొట్టుకున్న సమయం ఇలా ప్రతీది గుర్తుకొస్తుంది నేడు. స్వరాష్ట్రం వచ్చినప్పటికి కూడా తెలంగాణ ప్రజలు ఆశించిన మేరకు మేలు పొందలేకపోయారు. 

ఉద్యమకారుల ఊసేలేదు!

స్వరాష్ట్ర సాధన ముఖ్యమని టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించక ముందే నాలో ఆలోచన పుట్టింది. అప్పుడే కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ పెడతామని చర్చలు జరుపుతున్న సమయంలో నేరుగా మహబూబ్‌నగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరి ప్రత్యేకంగా కేసీఆర్‌ను కలిసి స్వరాష్ట్రం సాధన మా శాయశక్తుల సహకారం మీకు ఉంటుందని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారమే రైల్ రోకో, సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ ఇలా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంచేశాం. ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని పల్లెపల్లె తిరిగి చాటిచెప్పాం. కేసీఆర్ నేరుగా రహీం బాగున్నావా? అనే స్థాయిలో పనిచేశా. కానీ, ఎప్పుడూ కూడా రహీం నీ కుటుంబం ఎలా ఉంది? తెలంగాణ వచ్చాక ఉద్యమకారుల ఆశయాలు నెరవేరయా? లేదా? అనే కోణాల్లో మాత్రం ఎప్పుడూ చర్చించలేదు. -

35 కేసులు పెట్టిండ్రు 

మలిదశ తెలంగాణ ఉద్యమంలో వివిధ కార్యక్రమాల్లో పోరాటాల్లో కీలక బాధ్యతలు నిర్వహించా. దాంతో అప్పటి ప్రభుత్వం నాపై దాదాపుగా 35 కేసులు పెట్టింది. పోలీసుస్టేషన్ చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలే. ఇంట్లో ఉన్నవారేమో ఎందుకు ఉద్యమానికి వెళ్లావు? ఏమి సాధించావు? మన కుటుంబం ఏం బాగుపడ్డది? అంటూ లెక్కకుమించి ప్రశ్నలు వేస్తున్నారు. కానీ, వాటన్నింటికి ఒక్కటే సమాధానం.. తెలంగాణ సిద్ధించడమే నా లక్ష్యం అనుకున్నా. ఉద్యమాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. ఈ విధమైన ఆలోచన ఎప్పటికి ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పటికి కూడా మరో కేసు ఉంది. ఆ కేసు వచ్చినప్పుడు కూడా కోర్టుకు వెళ్లి హాజరవుతూ వస్తున్నా. ఉద్యమానికి పిల్లర్లుగా పనిచేసిన ఉద్యమకారులను గత ప్రభుత్వం కనీసం గుర్తింపు కార్డులను కూడా ఇవ్వలేదు. 

ప్రజల సంక్షేమం కోసం..

ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమం ఏర్పడి, అందర్నీ ఒకతాటిపైకి తీసుకువచ్చి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామో. ఆ లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్రస్తుత ప్రభుత్వమైనా అటువైపు అడుగులు వేయాలి. కాలయాపన చేయడం మంచిది కాదు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సమాంతరంగా అభివృద్ధి చేసేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా పాలమూరుకు సాగునీరు లేదు? దీనికి కారణం పాలకులే అవుతారని ప్రత్యేకంగా చెప్పాలా? ఇకనైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తే బాగుంటుంది.

- జిల్లెళ్ల రఘు, విజయక్రాంతి, మహబూబ్‌నగర్