calender_icon.png 25 November, 2024 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం

25-11-2024 02:54:33 AM

ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ 

ముంబై, నవంబర్ 24: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని, ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థుల గెలుపు కోసం మరింత కష్టపడి ఉంటే తమ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన ఆదివారం కరాడ్‌లో మీడియాతో మాట్లాడారు.

మహిళలు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనడం, లడ్కీ బెహన్ పథకం, మతపరమైన విభజనలు మహాయుతి విజయానికి కలిసి వచ్చాయని భావిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిందని, అదే విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లామన్నారు. ఎన్సీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయనేది వాస్తవమని, కానీ, ఆ పార్టీ అసలు ఎవరిదనేది ప్రజలకు తెలుసునన్నారు.

బారామతిలో అజిత్ పవార్ ప్రత్యర్థిగా తన మనవడు యోగేంద్ర పవార్‌ను నెలబెట్టడం తప్పుడు నిర్ణయమేమీ కాదని, ఎన్నికలన్నాక, పోటీ అన్నాక.. ఎవరో ఒకరిని బరిలో నిలపాల్సిందేనని, దీనిలో భాగంగానే తన మనవడితో పోటీ చేయించామని తేల్చిచెప్పారు. ‘క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’ ప్రశ్నించగా.. పార్టీ సహచరులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ) ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎంవీఏతో పొత్తులో భాగంగా కేవలం 86 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి పదంటే పది సీట్లకు మాత్రమే పరిమితమైంది. పార్టీకి కంచుకోట బారామతిలో పవార్ మనవడు యుగేంద్రపవార్ బరిలో నిలిచారు. ఆయనపై ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్ ఘన విజయం సాధించారు. 

రాజ్యసభకూ వెళ్లలేరు..

పవార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియనున్నది. కానీ, ఎన్సీపీ, శివసేన (యూబీటీ)కి అసెంబ్లీలో తగినంత బలం లేనందున, ఆయా పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించే అర్హతను శరద్ పవార్ కోల్పోతున్నారు. ఆయనతో పాటు శివసేన (యూబీటీ)కి చెందిన రాజ్యసభ సభ్యులు ప్రియాంక చతుర్వేది, సంజయ్ రౌత్‌ది కూడా ఇదే పరిస్థితి.