* రాష్ట్రంలో సరిగా చేయనివాళ్లు.. దేశంలో ఎలా చేస్తారు
* బీసీల లెక్కల్లో భారీ తేడాలున్నాయి: జాజుల శ్రీనివాస్‌గౌడ్
* మా ఆత్మాభిమానం దెబ్బతీశారు : రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రిపోర్టులో పేర్కొన్న కులాల గణాంకాల రిపోర్టును తాము తిరస్కరిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేష్‌చారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కులాల వారీ జనాభా లెక్కల శాతం రిపోర్టును చింపివేసి నిరసన తెలిపారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం వెల్లడించిన బీసీ గణాంకాల్లో భారీ తేడాలున్నాయని, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభాను తక్కువగా చూపారని.. పిడికెడు మంది లేని ఓసీల జనాభాను మాత్రం గతం కంటే 16లక్షలు ఎక్కువగా ఉందని తెలిపారు.
బీసీ జనాభాను దాదాపు 40లక్షలు తక్కువగా చూపారని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జనాభాను చూపించడంలో కూడా తక్కువగా చూపారని ఆరోపించారు. దేశంలో కులగణన చేయాలని లోక్‌సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నారని, తెలంగాణలో సరిగా చేయలేనివాళ్లు.. దేశంలో ఎలా చేస్తారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ కాదని.. రెడ్డి కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు. జెండాలు పక్కన బెట్టి బీసీ నాయకులంతా రాజకీయాలకతీతంగా ఒక్కటై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అన్ని పార్టీల వల్లే ఈ పొరపాట్లు..
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని తాము డబ్బులు, పదవులు అడుగలేదని, బీసీల లెక్కలు చెప్పమంటే తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారన్నారు. అన్ని పార్టీల వల్లే ఇన్ని పొరపాట్లు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేను వేగిరంగా నిర్వహించిందని, కొన్ని పార్టీలు అభిప్రాయాలే చెప్పలేదన్నారు.
బీహార్‌లో 17 అంశాలపైనే సర్వే చేశారని.. ఇక్కడ మాత్రం 57 అంశాలపై సర్వే చేశారన్నారు. పొరపాట్లు ఎక్కడ జరిగాయో గమనించి మిగతా వారి వివరాలను సేకరించాలని సూచించారు. రాష్ట్రంలోని అందరి ఇండ్లలో సర్వే జరుగలేదని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా, కుట్రపూరితంగా బీసీల సంఖ్యను తగ్గించి చూపారని.. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు.
బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగలెక్కలు చెబుతోందని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరేందర్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బీసీ సంఘాల నాయకులు మహేష్‌యాదవ్, విక్రమ్‌గౌడ్, శేఖర్, దుర్గయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.