calender_icon.png 25 January, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

24-01-2025 05:31:26 PM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే...

వాంకిడి (విజయక్రాంతి): అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. శుక్రవారం జిల్లాలోని వాంకిడి మండలం జైత్ పూర్ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలపై నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. గతంలో ప్రజా పాలన, సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ, కుల గణన సర్వే, ప్రజావాణి కార్యక్రమాలలో అందిన దరఖాస్తులను క్రోడీకరించి ఇంటింటా సర్వే, గ్రామాలలో సర్వే నిర్వహించి జాబితాలను రూపొందించడం జరిగిందని తెలిపారు.

అర్హత కలిగి ఉండి జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తు చేసుకోవచ్చని, జాబితాలో అర్హులు కాని వారి పేర్లు ఉంటే అభ్యంతరాలు తెలిపినట్లైతే రిజిస్టర్ లో నమోదు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారి వివరాలు స్థానిక ప్రజలకు తెలుస్తుందని, వివరాల పరిశీలన కొరకు గ్రామ సభలలో అర్హుల జాబితాను చదివి వినిపించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా క్రింద సాగు యోగ్యం గల భూముల వివరాలు తయారు చేయడం జరిగిందని, యోగ్యం కానీ రాళ్లు, గుట్టలు, ప్లాట్లు, వెంచర్లు, కాలనీలు, భూ సేకరణ క్రింద తీసుకున్న భూములను జాబితా నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డు కొరకు, రేషన్ కార్డులు వివరాల చేర్పులు, మార్పులు, తొలగింపుల కొరకు అవకాశం ఉందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. అర్హత గల ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కార్డు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద అర్హులైన నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పని చేసిన భూమి లేని వారందరికీ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రియాజ్ అలీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.