calender_icon.png 25 October, 2024 | 3:56 AM

సింగరేణిని కాపాడుకుంటాం

05-05-2024 12:55:48 AM

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

భద్రాద్రి కొత్తగూడెం, మే ౪ (విజయక్రాంతి): కేసీఆర్ పాలనలో సింగరేణి నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని కాపాడుకుంటుందని ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియం  జరిగిన జనజతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సింగరేణి కార్మికుల కోసం రూ. కోటి బీమా పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. మూసివేసిన ఎన్‌ఎండీసీ తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కొత్తగూడెంలో మరో 800 మెగావాట్ల ధర్మల్ పవర్‌స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్థిక క్రమ శిక్షణ కన్పిస్తున్నదని స్పష్టంచేశారు. 

ప్రజల ఓట్లే గీటురాయి : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్ర పాలన ఎంత బాగుందో చెప్పడానికి పార్లమెంట్ ఎన్నికలే రెఫరెండమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజల ఓట్లే గీటురాయి అని పేర్కొన్నారు. ఆంధ్రాలో కలిసిన ఏడు మండలా లను మనం తెచ్చుకోవాలి అంటే కాంగ్రెస్ గెలవాలని చెప్పారు. పంట నష్టం పరిహారం కొద్ది రోజుల్లోనే ఇస్తామని వెల్లడించారు. 

బీఆర్‌ఎస్, బీజేపీవి తెర వెనుక డ్రామాలు: మంత్రి పొంగులేటి 

బీజేపీకి బీటీంగా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్నదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మంలో నామాను గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతాడని కేసీఆర్ చెప్పిన మాటను బట్టి వారి తెరవెనుక డ్రామా బట్టబయలు అయిందని అన్నారు. అధికారంలో  ఉన్నప్పుడు సంక్షేమం మరిచి ఇప్పడు కర్ర పట్టుకొని జిల్లాకు వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.