మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖపై విద్యాశాఖ స్పందన
హైదరాబాద్, జూలై 7(విజయక్రాంతి): మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించి గత డిసెంబరు నాటికి ఉన్న బకాయిలు రూ.50 కోట్లతో పాటు అదనంగా మరో రూ.50.45 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. మరో రూ. 53.07 కోట్లు త్వరలోనే విడుదల కానున్నాయని పేర్కొంది. విద్యాశాఖ సమస్యలపై స్పందించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు రాసిన లేఖకు విద్యాశాఖ స్పందించింది. గత ప్రభుత్వ హయాంలో 5,089 పోస్టులతో డీఎస్సీ విడుదల చేస్తే తాజాగా ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి అంతకు రెట్టింపు సంఖ్య 11,069 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలియజేసింది. ఈ నెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది.
మధ్యాహ్న భోజన కుక్ కమ్ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ వరకు నెల కు రూ.వెయ్యి చొప్పున చెల్లించామని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.2 వేల ల్లో 80 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని, మిగిలిన రూ.9.44 కోట్లు త్వరలోనే చెల్లించనున్నట్లు వెల్లడించింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 9, 10 తరగతుల వంట ఖర్చులకు సంబంధించిన బిల్లులు రూ.8.74 కోట్లు డీఈవోలకు ఇప్పటికే చెల్లించినట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది. మిగిలిన బకాయిలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. కోడిగుడ్ల బిల్లులకు సంబంధించి మార్చి వరకు రూ.13.82 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయని, మరో రూ.8.48 కోట్లు త్వరలోనే చెల్లించనున్నట్లు వెల్లడించింది.
రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మొత్తం 26 వేల పాఠశాలల్లో తొలి రోజే విద్యార్థులందరికీ ఒక జత యూనిఫాం అందజేశామని, రెండో జత యూనిఫాం ఈ నెలాఖరకు అందించనున్నట్లు తెలిపింది. పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు వెల్లడించింది. ఎటువంటి బడ్జెట్ కేటాయించకుండా గత ప్రభుత్వం సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, అయినప్పటికీ మార్చి నాటికి పెండింగ్‌లో ఉన్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ బకాయిలు రూ.3.5 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది. సర్వశిక్షా అభియాన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్‌ల జీతాలు పెండింగ్‌లో లేవని, జూన్ నెల వరకు వేతనాలు చెల్లించినట్లు స్పష్టం చేసింది.