16-04-2025 12:34:13 AM
తెలంగాణ ఆల్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్
ముషీరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం నిన్నకాక మొన్న వచ్చిన గిగ్ వర్కర్స్ కోసం ఒక ముసాయిదా బిల్లును తయారు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం పట్ల రాష్ట్రంలోని అన్ని రవాణా రంగ కార్మికుల ట్రేడ్ యూనియన్ లు వ్యతిరేకిస్తూన్నాయని తెలంగాణ ఆల్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్(ఐఎన్ టీయూసీ) గ్రేటర్ అధ్యక్షులు ఎన్.దయానంద్ తెలిపారు.
రవాణారంగా కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని పలుమార్లు రాష్ట్రంలోని అన్ని యూనియన్లు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు, సంబంధిత అధికారులకు విన్నవించిన అదిగో, ఇదిగో అంటూ కాలయా పన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మెరకు మంగళవారం నారాయణగూడలో యునియాన్ నాయకులు నరసింహారెడ్డి, మల్లేష్ గౌడ్, బి.రామకృష్ణారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ట్రేడ్ యూనియన్ నాయకులను సంప్రదించకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
ఇప్పటికైన అన్ని యూనియన్ల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రవాణా రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆదాయం ఇవ్వని గిగ్ వర్కర్స్ కు సంబందించిన ముసాయిదా బిల్లును తయారు చేయడం ఏంటని ప్రశ్నించారు. వివిధ రూపాలలో ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయాన్ని అందిస్తున్న రవాణా రంగంపై ప్రభుత్వం వివక్ష చూడటం భావ్యం కాదన్నారు.
రవాణా రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పెడచెవిన రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22న ఇందిరాపార్క్ వద్ద రవాణారంగ కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు.