calender_icon.png 13 January, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ భారత నిర్మాణ యోధులు కావాలి

17-09-2024 12:00:00 AM

రాజకీయ నాయకులు ఎప్పుడూ రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తే రాజనీతిజ్ఞులు భావితరాల భవిష్యత్తు గురించి బాధపడతారు. ఆధునాతన ప్రపంచంలో కాలాన్ని మించిన వేగంతో శాస్త్ర సాంకేతిక రంగాలు పురోగమిస్తున్నాయి. నవభారత నిర్మాణానికి ఉద్యమించి దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేయవలసిన పవిత్ర బాధ్యత ఈ దేశ నిరుద్యోగ యువత భుజస్కందాలపై ఉంది. చాలామంది విషయంలో చదివే చదువుకు, జీవనోపాధికి సంబంధం లేకుండా పోతున్నది. పెద్ద పెద్ద చదువులు చదివిన ఎందరో చిన్న చిన్న ఉద్యోగాలకు క్యూలు కడుతున్నారు.

తాజాగా హర్యానా ప్రభుత్వం కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు ప్రకటన ఇస్తే యావత్ భారతం విస్తు పోయేలా 6000కు పైగా పోస్టు గ్రాడ్యుయేట్లు, 39 వేల పైగా గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం పొందిన వారు ప్రభుత్వ విభాగాల్లో కార్పొరేషన్లు, ఇతర కార్యాలయాల్లో ఊడ్చడం ,శుభ్రం చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. అందుకు సిద్ధపడ్డారంటే దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.ఇంజనీరింగ్ విద్య చదివిన విద్యార్థులు ఎందరో గ్రామాల్లో రోజువారీ కూలీకి, కరువు పనికి సైతం వెళుతున్నారు.

చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది బంగారు కొలువుగా మారిన ఈ తరుణంలో కొలువు రాక కొన్నిచోట్ల నిరుద్యోగులు ఆత్మహత్యలకు సైతం వెనకాడడం లేదు. ఇలాంటి సందర్భాల్లో నేటి నిరుద్యోగ యువత ఆలోచన ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే వెంటనే మిగతా వ్యాపార, రాజకీయ, ఇతర రంగాల్లోకి విస్తరించాలి. 

దేశం ఎదుర్కొంటున్న సమస్యలు

దేశంలో జీవన పోరాటంలో తగినంత ఆహారం లభించని కుటుంబాలు లక్షల్లో  ఉంటున్నాయి. ఒకవైపు సంపన్నులలో ఆ ర్థిక వృద్ధి పెరుగుతుంటే, మరోవైపు పేదల సంఖ్య, ఆకలితో పస్తులుంటున్న కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. 2023లో 125 దేశాలలో భారత్ ఆకలి కుటుంబాలలో 111 వ స్థానంలో ఉంది. 2022లో ఇదే 125 దేశాలలోమన దేశం 107వ స్థానంలో ఉంది. 2023 నాటికి ఆకలి రేటు పెరిగింది. ఆకలి రేటు 100 ఉంటేనే అది అధ్వాన్న స్థితిలో ఉన్నట్లు భావిస్తారు. అలాంటిది ఈరోజు 111వ స్థానం అంటే దేశ నిరుద్యోగ యువత ఆలోచించాలి.

పౌష్టికాహార లోపం

పౌష్టికాహార లోపం భారంతోదేశం గణనీయమైన సవాలు ఎదుర్కొంటున్నది. ఈ సమస్య దేశంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యత్యాసాల సంక్లిష్ట మిశ్రమంతో ముడిపడి ఉంటుంది. ఐక్య రాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య భద్రత, పోషకాహార స్థితి తాజా నివేదిక 2024 ప్రకారం దేశ జనాభాలో 55.6 శాతం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. ఈ ఏడాది గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్  నివేదిక దేశ జనాభాలో 16.6 శాతం పోషకాహార లోపంతో ఉన్నారని, కనీసం 38శాతం అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారని తెలిపింది. 

విద్యార్థుల ఆత్మహత్యలు

 జాతీయ అభివృద్ధిలో బహుముఖ పాత్ర పోషించే విద్యార్థుల ఆత్మహత్యలు జాతికి తీరని లోటు. ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, మరోవైపు విద్యార్థుల ఆత్మ హత్యలు సమాజానికి సవాలుగా మారా యి. ‘జాతీయ క్రైమ్ రిపోర్ట్’  ప్రకారం నాలుగేళ్లలో దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు 33శాతం పెరిగాయి. 2017లో 9,905మంది  విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా 2021 వచ్చేసరికి ఆ సంఖ్య 13,089కు పెరిగింది. ఈ ఆత్మహత్యలకు ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దేశంలో నిరుద్యోగులుగా ఉన్న వారిలో 83శాతం మంది యువజనులేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)వెల్లడించింది.

దేశంలో నిరుద్యోగిత ప్రస్తుతం 9.2 శాతం ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సిఎంఐ) పరిశోధన సంస్థ పేర్కొంది. ఉద్యోగాల కల్పన విషయంలో భారత్ జీ20 సభ్య దేశాలన్నిటికంటే వెనుకబడి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అన్నారు. 1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు గిగ్ వర్కర్లుగా జీవన సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో పేదరికం, నిరుద్యోగిత విపరీతంగా ఉండి ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్ద అయినా ప్రయోజనం ఉండదు.

మాదకద్రవ్యాలు

ప్రస్తుతం ప్రపంచంలో ఉగ్రవాదం తర్వాత అంతే పెను సవాలుగా పరిగణిస్తున్న సమస్య మాదకద్రవ్యాల వినియోగం. ప్రపంచ జనాభాలో 22 శాతం జనాభా మత్తు మందులకు బానిసలుగా గత దశాబ్ద కాలంలో చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందులో 40 శాతం యువతే.అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ లాంటి దేశంలో యువత ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి దేశంలో మాదకద్రవ్యాల సమస్య తీవ్రమైన విషయం. 2019 జరిగిన ఆత్మహత్యల్లో 98.2 శాతం మత్తుకు బానిస అయిన వాళ్లేనని నివేదికలు చెబుతున్నాయి. 

మహిళా సాధికారత

మహిళలు ,పురుషులు సమానమని భారత రాజ్యాంగం చెబుతోంది. సమాన అవకాశాలు కల్పిస్తామని పాలకులు తర చూ చెప్తున్నా  వాస్తవ పరిస్థితులు అందు కు భిన్నంగా ఉన్నాయని వరల్డ్ ఎకానమీ ఫోరం నివేదికలో తేలింది. 2006 నుంచి పోలిస్తే ఈ ఏడాది స్త్రీ , పురుషుల అసమానతలు పెరిగాయని ప్రపంచ ఆర్థిక ఫోరం తెలిపింది.2023 నాటి  నివేదిక ప్రకారం 146 దేశాల్లో మన దేశం 127 వ స్థానంలో ఉంది. 2023 ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో గాని, పార్లమెంట్ ఎన్నికల్లో గాని ఏ రాజకీయ పార్టీ కూడా ఆ బిల్లు ప్రకారం రిజర్వేషన్ కల్పించడంలో విఫలమయ్యాయి. మహిళాభివృద్ధి అన్ని రంగాల్లో జరిగినప్పుడు మాత్రమే మహిళా ఆర్థిక సాధికారత సాధ్యమవుతుంది.

ప్రజలు తమ సమస్యల పరిష్కరించడానికి నీతిమంతులైన నాయకులను కోరుకుంటారు కానీ అవినీతిలో కూరుకుపోయి కేసుల్లో ఇరుక్కున్న నాయకులని గెలిపిస్తున్నారు. గతంలో నాయకులు బ్రిటిష్ వారిపై పోరాటం చేసి జైలుకెళ్తే, ప్రస్తుతం నాయకులు అవినీతి కేసుల్లో జైలు పాలవుతున్నారు. ఇలాంటి సందర్భంలో నేటి నిరుద్యోగ యువత ప్రభుత్వ కొలువులే పజలకు సేవ చేసే మార్గం అనుకోకుండా రాజకీయ మార్గాన్ని కూడా సేవగా భావించి రాజకీయాల్లోకి రావాలి. ప్రతి నిరుద్యోగ పౌరుడు దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ఆలోచనలను, తమ సామర్థ్యాలను ఉపయోగించాలి. సామాజిక సమస్యల పరిష్కారంలో భాగంగా దేశ, రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించాలి. అప్పుడే దేశ, రాష్ట్ర నవనిర్మాణం సాధ్యం.

అశోక్ యాదవ్ పంచిక