11-03-2025 12:00:28 AM
వర్ధమాన ఇంజనీర్లకు ఫైటెక్ ఎంబెడెడ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ సూచన
పటాన్ చెరు, మార్చి 10 : వర్ధమాన ఇంజనీర్లు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని ఫైటెక్ ఎంబెడెడ్ సేల్స్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఎమర్జింగ్ ఐఐవోటీ ధోరణులు, ఆవిష్కరణలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ డీపీ) సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఆవిష్కరణలను నడిపించడంలో ఇంజనీర్ల పరివర్తన పాత్రను నొక్కి చెప్పారు. ఇంజనీర్లు కేవలం సేవ కోసం ఉద్దేశించబడలేదని, వారు కొత్త అవకాశాలు, ఉద్యోగ సృష్టికర్తలుగా అభివర్ణించారు. భారతదేశంలో సాఫ్టేవేర్ లో ముందున్నప్పటికీ, స్వదేశీ హార్డ్ వేర్ లేదని, అలాగే ఎన్నో బహుళ జాతి కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నప్పటికీ, మనదైన విశ్వశ్రేణి ఉత్పత్తులు పెద్దగాలేవని విచారం వెలిబుచ్చారు.
ఫైటెక్ ఎంబెడెడ్ లో లెక్కలేనన్ని వినూత్న ఉత్పత్తుల రూపకల్పన చేయగల మైక్రోప్రాసెసర్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. కొత్త వాటిని సృష్టించాలని, ఆవిష్కరణలు చేయాలని అభిలషించే వారంతా, తమ దృక్పథాన్ని తక్షణం మార్చుకుని, ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలన్నారు.